ఆ రెండు గ్రామాల్లో నిశ్శబ్దం

 

వారి ఇంటి ఛాయలకు వెళ్లని ప్రజలు

తమకు అవమానంగా భావించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాల్లోని ఆ నాలుగిండ్లలో విషాదం అలుముకున్నది. బాధిత కుటుంబాలు మినహా మిగతావారు పెద్దగా స్పందించలేదు. హతుల గ్రామాల్లో స్థానికులు మౌనముద్ర వహించారు. ఓ రకంగా ఇది తమకు అవమానకరంగా వారు బాధపడ్డారు. తమ గ్రామాల పరువు పోయిందన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి వద్ద నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జక్లేర్‌, గుడిగండ్ల గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. కోర్టు పరిధిలో కేసు ఉండగా పోలీసులు కావాలనే తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని మృతుల కుటుంబాలు రోదించాయి. తమను అనాథలను చేశారని వాపోయారు. గత నెల 27న శంషాబాద్‌ సవిూపంలో లైంగికదాడి, హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకొని 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని.. వారిని జక్లేర్‌కు చెందిన మహ్మద్‌ పాషా, గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌గా తేల్చారు. మృతదేహాలను తీసుకొస్తారని తెలియడంతో విూడియా ప్రతినిధులు గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాలకు చేరుకున్నారు. రాత్రి 8 గంటలవరకు మృతదేహాలు వస్తాయని ఎదురుచూశారు. మహబూబ్‌నగర్‌ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం హైకోర్టు ఆదేశాలమేరకు మృ తదేహాలను మార్చురీలోనే ఉంచారు. ఇకపోతే మహబూబ్‌నగర్‌ దవాఖానలో భద్రత మధ్య మృతదేహాలకు రాత్రి 10 గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించారు. కాల్పుల్లో 11 బుల్లెట్లు మృతుల శరీరాల్లోకి దూసుకెళ్లినట్టు సమాచారం. శవ పంచనామాలో ప్రధాన నిందితుడి ఆరిఫ్‌పాషాకు నాలుగు బులలలెట్లు వీపు, ఛాతిలోకి దూసుకెళ్లగా, శివకు మూడు బుల్లెట్లు, నవీన్‌కుమార్‌కు

మూడు బుల్లెట్లు తల, వెనుకభాగంలో దిగాయని, చెన్నకేశవులకు తల భాగంలోకి ఒక బుల్లెట్‌ దూసుకెళ్లి నట్టు తెలిసింది. షాద్‌నగర్‌ జిల్లా జడ్జి లేకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారని మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి దవాఖాన వద్దకు వచ్చి అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతకుముందు ఎన్‌కౌంటర్‌లో హతమైన చెన్నకేశవులు, శివ, నవీన్‌ అంత్యక్రియల కోసం తవ్వించిన స్థలం వివాదాస్పద మైంది. గ్రామానికి చెందిన వెంకటమ్మ పొలంలో ఖననానికి గుంతతీయడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోచోట ఏర్పాట్లుచేశారు. ఇకపోతే చెన్నకేశవులు భార్య రేణుక కన్నీరుమున్నీరయ్యారు. తన భర్తను పట్టుకుపోయిన నాటి నుంచే ఆమె రోదిస్తూనే ఉంది. తనకు పెళ్లయి ఏడాదయింది. నేను నిండు గర్భిణిని. భర్త లేకుండా నేను ఉండలేనంటూ తనను కూడా చంపేయండని రోదిస్తోంది. పోలీసులు నా భర్తను చంపినచోటే నన్నూ కాల్చివేయాలి అంటూ కన్నీరు పెట్టారు. తన భర్తను తీసుకెళ్లేముందు తిరిగి సురక్షితంగా ఇంటికి పంపిస్తామని చెప్పారని, కానీ ప్రాణాలు తీశారని రోదించారు. నా కొడుకు నేరంచేసి ఉండొచ్చేమో కానీ, ఇలాంటి మరణం సరికాదు అని మృతుడు శివ తండ్రి జొల్లు రాజప్ప ఆవేదన వ్యక్తంచేశారు. చాలామంది లైంగికదాడులు, హత్యలకు పాల్పడ్డారని, వాళ్లకు ఇలాంటి చావు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జక్లేర్‌, గుడిగండ్ల గ్రామాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. మహ్మద్‌ పాషా తండ్రి హుస్సేన్‌ను, చెన్నకేశవులు తండ్రి కుర్మప్పను, జొల్లు శివ తండ్రి రాజప్ప, జొల్లు నవీన్‌ తల్లి లక్ష్మిని వనపర్తి ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ స్థలికి తరలించారు.