ఇంగ్లాండ్‌లో విరాట్‌ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ అకిబ్ జావెద్

విరాట్ కోహ్లీ.. శతకం బాది దాదాపు రెండేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ విరాట్‌ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో 24.80 సగటుతో 124 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్‌ బ్యాటింగ్ తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ అకిబ్ జావెద్ మాట్లాడాడు.

‘ఆసియాలో కోహ్లీ విలక్షణమైన ఆటగాడు. ఇతడు ఆస్ట్రేలియాలో కూడా బాగా ఆడగలడు. కానీ, ఇంగ్లాండ్, దక్షిణఫ్రికా వంటి దేశాల్లో బంతికి స్వింగ్ లేదా సీమ్‌ లభించినప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. అవుట్ స్వింగర్లను అతడు బాదుతాడు’ అని జావెద్‌ అన్నాడు.

మరోవైపు, ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్‌ జో రూట్ క్రీజులో పాతుకుపోయి భారీ స్కోర్లు సాధించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలున్నాయి. రూట్‌ బ్యాటింగ్ తీరుపై కూడా జావెద్‌ స్పందించాడు. ‘ఇంగ్లాండ్‌లోని కఠినమైన పిచ్‌లపై బంతిని ఆలస్యంగా ఎలా ఆడాలో రూట్‌కి బాగా తెలుసు. ఆ టెక్నిక్‌ అతడిని కాపాడుతోంది’ అని జావెద్‌ పేర్కొన్నాడు.

సెప్టెంబరు 2న ఓవల్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో  మొదటిది డ్రా కాగా, రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించింది. మూడో టెస్టులో అతిథ్య జట్టు గెలుపొందడంతో సిరీస్‌ 1-1తో సమం అయింది.