ఇంటర్‌బోర్డు కార్యాలయం ముట్టడికి.. ఏబీవీపీ కార్యకర్తల యత్నం


– ఆందోళన కారులను అడ్డుకున్న పోలీసులు
– పలువురిని అరెస్టు చేసిన పోలీసులు
– ఏ విద్యార్థికి నష్టంజరగదని ట్వీట్‌చేసిన కేటీఆర్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. భారీసంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవటంతో ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్‌ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రీవాల్యుయేషన్‌, రీవెరిఫికేషన్‌ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ రాజీనామా చేయాలని విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన ఉధృతం చేసి.. కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతుండటంతో పలువురు ఏవీబీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యాలయం వద్ద బైఠాయించారు. తమ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలాఉంటే ఆదివారం పలు విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డుతీరుపై ఆందోళన చేపట్టాయి. ఇంటర్‌ మూల్యాంకనంలో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) నాయకులు నిజాం కళాశాల ఎదుట ధర్నాచేశారు. మూల్యాంకనాన్ని తిరిగి చేపట్టాలన్నారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాలేజీ గేటు ఎదుట విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఫలితాల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడవద్దని, ప్రతీ ఒక్క విద్యార్థికి పూర్తిన్యాయం జరుగుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.