ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం

వారిని పట్టించుకోని టిఆర్‌ఎస్‌కు ఓటెయ్యొద్దు: పొన్నం
కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): ఇంటర్‌ విద్యార్థుల మృతికి కారణమైన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. తొలిదశ ప్రాదేశిక ఎన్‌ఇనకల గడువు శనివారంతో ముగియ నుండడంతో పాలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోయినా పట్టించుకోని కెసిఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అలాంటి పార్టీకి తిరిగి ఓట్లు వేస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్‌ మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేరని, అలాంటి పార్టీకి మహిళలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరీనా సంస్థలో కేటీఆర్‌ బావమరది కూడా ఉన్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు అహంకారం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. వారి అహంకారం తగ్గాలంటే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.