ఇండోనేషియాను మరోసారి వణికించిన భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదు

ఆందోళనలో ప్రజలు..కొనసాగుతున్న సహాయక చర్యలు

బాలి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాలోని లాంబోక్‌ ద్వీపంలో వచ్చిన భారీ భూకంపం ఇండోనేషియాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ప్రభావం నుంచి తేరుకోకముందే గురువారం ఉదయం లాంబోక్‌లో మళ్లీ భూమి కంపించింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. ఆదివారం సంభవించిన భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద మరణించిన వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. ఈ దశలో మరోమారు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే తీవ్రత తక్కువగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి భూకంపం రావడం ప్రజలను, సహాయక సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది. లాంబోక్‌లోని తాంజుంగ్‌ ప్రాంతంలో సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రజలు అరుపులు, ఏడుపులతో పరుగులు పెట్టారని ఘటనాస్థలాన్ని స్వయంగా చూసిన విలేకరి ఒకరు వెల్లడించారు. నేటి భూకంపం కారణంగా వాహనాలు కింద పడిపోయాయని, కొన్ని భవనాల గోడలు కూలిపోయాయని తెలిపారు. ఆదివారం లాంబోక్‌ ద్వీపంలో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. 164 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. 1400మందికి గాయాలయ్యాయని, 1,50,000 మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. అయితే ఆదివారం నాటి భూకంపం కారణంగా347 మంది చనిపోయారని అక్కడి అంటారా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఆ సంఖ్యనుధ్రువీకరించలేదని, అధికారిక సంఖ్య కాదని అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని, మారుమూల ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని వెల్లడించారు. నష్టం వివరాలు పూర్తిగా అంచనా వేయలేదని చెప్పారు.

——————–