ఇండోనేషియాలో మరోమారు ప్రకంపనలు

సుంబా దీవిలో రెండుసార్లు కంపించిన భూమి

జకర్తా,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి కన్నెర చేసింది. ఇటీవల సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం, సునావిూ ధాటికి మరభూమిని తలపిస్తున్న ఇండోనేసియాకు మరో షాక్‌ తగిలింది. మంగళవారం ఉదయం సుంబా దీవిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. తొలుత రిక్టర్‌ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 15 నిమిషాల్లోపే మరోసారి రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. సులవేసి దక్షిణాన 1600 కిలోవిూటర్ల దూరంలో ఉన్న సుంబా దీవిలో 7.5 లక్షల మంది జనాభా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శుక్రవారం సులవేసి ద్వీపాన్ని అతలాకుతలం చేసిన సునావిూ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే అధికారంగా 832 మంది చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య దాదాపు 1200కు చెరినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్న రెడ్‌ క్రాస్‌ సిబ్బంది సిగి జిల్లాలో ఓ కూలిన చర్చి భవనం కింద 34 మంది విద్యార్థుల మృతదేహాలను కనుగొన్నారు. ఆ చర్చి ట్రైనింగ్‌ సెంటర్‌లో విపత్తు సంభవించిన సమయంలో మొత్తం 86 మంది విద్యార్థులు బైబిల్‌ చదువుతున్నారని భావిస్తున్నారు. దీంతో గల్లంతైన 52 మంది విద్యార్థుల కోసం సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇండోనేసియాలో భూకంపం, సునావిూ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.