ఇందిరాపార్కులో అగ్నిప్రమాదం

– భయాందోళనకు గురైన వాకర్స్‌
– మంటలను అదుపు చేసిన ఫైర్‌సిబ్బంది
– ఇందిరాపార్క్‌ ను డంపింగ్‌ యార్డుగా మార్చారు
– జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : నగరంలోని ఇందిరా పార్కులో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం పార్కులో ఉన్న డంపింగ్‌ యార్డులో మంటలు చెలరేగడంతో వాకింగ్‌ చేస్తున్న వారు భయబ్రంతులకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి
సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక శకటాలతో గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పార్కులోని గంధం, కొబ్బరి చెట్లు ఆగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఘటన స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా పార్క్‌లో చెత్త వేయొద్దని చెప్పినప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్‌ తరలింపును అడ్డుకుంటునందుకు కేసీఆర్‌ను తనను బెదిరించారన్నారు. ఇందిరా పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికి తొమ్మిది సార్లు ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని.. తక్షణమే ఇక్కడి నుంచి డంబింగ్‌ యార్డును మార్చాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే తాము ఇక్కడ చెత్తను వేస్తున్నామని.. కావాలని చేయడం లేదని పేర్కొన్నారు.