ఇక పక్కాగా సబ్సిడీ ఎరువుల పంపిణీ

సిద్దిపేట,నవంబర్‌14 (జనంసాక్షి)  : అన్నదాతలకు అందించే సబ్సిడీ ఎరువులకు పకడ్బందీగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సాఫీగా ఎరువులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.  రైతు ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయడంతోపాటు వేలిముద్ర వేస్తేనే ఎరువులు ఇస్తారు. వంటగ్యాస్‌ సబ్సిడీ మాదిరి ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని డీలర్లకు కాకుండా నేరుగా రైతులకు ఇస్తారు. డీలర్లు, ఎరువుల కంపెనీల యాజమాన్యాలు అవకతవకలు, అక్రమాలకు పాల్పడకుండా  అమల్లోకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్‌ నుంచి అన్ని లావాదేవీలు పీవోఎస్‌ మిషన్ల ద్వారా జరుపాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు ఎరువులు కొనుగోలు ప్రతి రైతు వివరాలతో పాటు ఆధార్‌ నంబర్‌ను సేకరించి ఆన్‌లైన్‌ ద్వారా ఈ పక్రియను చేపట్టి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ప్రభుత్వం ఆదేశించింది. పారదర్శకంగా క్రయ విక్రయాలు జరుపాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యవసాయాధికారులు ఇప్పటికే పలుమార్లు డీలర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.  ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయంతీసుకుంది.  ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయడంతో ఎరువుల పంపిణీ విక్రయాలకు సంబంధించిన లెక్కల వ్యవసాయ శాఖ గతంలో కంపెనీలపై ఆధారపడాల్సి ఉండేది. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సందర్భంలో రైతు ఆధార్‌ నంబర్‌తో పాటు వేలి ముద్ర మిషన్‌ ద్వారా సేకరించాల్సి ఉంటుంది.