ఇక రైతులదే బాధ్యత

తెలంగాణలో చేపడుతున్న వ్యవసాయాభివృద్ది పనులకు సంబంధించి రైతులు కూడా చిత్తశుద్దిగా వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి. వారిని ఆదుకునేందుకు అనేక విధాలుగా ప్రభుత్వం ముందుకు వస్తోంది. గతంలో ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి పకాలు అమలుకాలేదు. రైతులకు నిరంతర విద్యుత్‌, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇప్పుడు పెట్టుబడి పథకం వస్తోంది. ఈ డబ్బులను కేవలం వ్యవసాయ పెట్టుబడి కోసమే వినియోగిస్తే ప్రభుత్వ లక్ష్యం సిద్దిస్తుంది. వ్యవసాయాన్ని అభివృద్ది చేస్‌ఏందుకు చేస్తున్న ప్రయత్నాల్లో బాగంగా రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందుకు సాగాలి. వచ్చిన డబ్బులను దుబారా చేస్తే మాత్రం ఇక ఎవరు కూడా వారిని ఆదుకోలేరు. అంతా ప్రభుత్వమే చేస్తున్నప్పుడు కష్టపడి వ్యవసాయాన్ని పరుగుల పెట్టించాలి. బంగారు పంటలు పండించాలి. కెసిఆర్‌ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి. నిజానికి ఇప్పటికే అనేక సబ్సిడీలను ఇస్తున్నారు. తాజాగా ఉపాధిని కూడా జోడించాలని సిఎం కెసిఆర్‌ కేంద్రంతో పోరాడుతున్నారు. కూలీల కొరతను అధిగమించి, సాగు పనుల్లో వేగం పెంచేందుకు తెలంగాణ సర్కారు, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు కోటి రూపాయలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా సాగుకు ఉపకరించే చిన్నచిన్న పరికరాలతోపాటు ట్రాక్టర్లను సైతం సబ్సిడీపై అందజేస్తున్నది వ్యవసాయరంగాన్ని ఆధునీకరించి, యంత్ర సాగును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా అన్నదాతలకు సబ్సిడీపై ఆధునిక యంత్ర పరికరాలు అందిస్తోంది. గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అంతగా పట్టించుకోలేదు. రైతులకు రావాల్సిన సబ్సిడీలు నామమాత్రమే. ఆధునిక యంత్రాల సబ్సిడీ కూడా ఇచ్చిన దాఖలులేవు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పనులు చేసుకునేందుకు వీలుగా భారీ యంత్రాలతోపాటు రైతులకు అవసరమయ్యే చిన్నచిన్న పరికరాలను సరఫరా చేస్తున్నది. కూలీల కొరతను అధిగమించి, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసుకునేందుకు ఈ యంత్రాలు ఉపయోగ పడనున్నాయి. దళారీ వ్యవస్థ చెక్‌ పెట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తున్నది. రాయితీపై సరఫరా చేస్తున్నా క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేక కొద్ది మందికే అవి అందుతున్నాయి. గతేడాది కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతువివరాలు ఉన్నతాధికారులు తెలుస్తాయి. ప్రభుత్వం సరఫరా చేసే యంత్రాలు, పరికరాలు, వాటి ధర, రాయితీ తదితర వివరాలు మండల వ్యవసా యాధికారి కార్యాలయంతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఉంటాయి. కావాల్సిన పరికరంతో పాటు కంపెనీ పేరు సూచిస్తూ విూ సేవలో దరఖాస్తు చేసుకునే వీలును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత కు అనుగుణంగా వస్తున్న యంత్రాల వినియోగంతో పేద రైతులకు పెంచిన రాయితీతో ప్రయోజనం చేకూరనుంది. గతంలో 50శాతం ఉన్న రాయితీని  95శాతానికి పెంచగా మిగిలిన ఐదు శాతం ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలు రుణంగా అందించాల్సి ఉంటుంది. బిందు, సేద్య పరికరాల్లోనే వంద శాతం రాయితీ ఉండేది. వ్యవసాయ యంత్రాలను గతంలో ఒకరిద్దరు రైతులు మాత్రమే ఉపయోగించు కునేవారు. గతంలో ట్రాక్టర్లు, రోటోవేటర్లు, కేజ్‌వీల్స్‌, నాటువేసే యంత్రాలు, నాగళ్లు, మక్కలు ఒలిచే యంత్రాలు, స్పేయ్రర్లు, ప్లవ్‌లు, కల్టివేటర్లు, తదితరాలను గ్రామంలో కొంతమంది బడా రైతులే పొందేవారు. ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా విలువలో 50శాతం మాత్రమే రాయితీ ఉండడంతో ఎక్కువమంది వాటిని
పొందలేకపోయారు. దీంతో ఏటా యాంత్రీకరణ పథకానికి కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రాయితీని పెంచడంతో అధికసంఖ్యలో సద్వినియోగం చేసుకునే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గతంతో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను మంజూరు చేసింది. అధిక సంఖ్యలో రైతులు ఈ సబ్సిడీ యంత్రాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఎస్సీ,ఎస్టీ రైతులకు సబ్సిడీ శాతాన్ని పెంచడంతో వారికి యాంత్రీకరణ మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఈ మంచి అవకాశాన్ని అర్హులైన రైతులందరు వినియోగించుకొని లబ్దిపొందాలి. ఉచిత విద్యుత్‌ ఇప్పటికే సాకారం అయ్యింది. ఎరువులు అందుబాటుల ఉంటున్నాయి. విత్తనాలను నాణ్యమైనవే గుర్తించి అందచేస్తున్నారు. ఇకపోతే చెరువు లపునరుద్దరణ కూడా వేగంగా సాగుతోంది. ప్రస్తుతం నాలుగో దశ నడుస్తోంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పూర్తియితే ఇక నీటి కొరత అన్నది రాదు. తెలంగాణ మరో కోస్తా కావాలన్న ఆకాంక్ష నెరవేర నుంది. తాజాగా ఇస్తున్న రైతుబంధు సాయంతో పెట్టుబడికి వెంపర్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం కూడా ఇంతకు మించి సాయం చేస్తుందంటే నమ్మలేం. కానీ తెలంగాణలో మాత్రమే ఇదంతా కళ్లకు కనిపించేలా జరుగుతోంది. ఈ అవకాశాలను కూడా అందిపుచ్చుకుని నాణ్యమైన పంటలను పండించడం ద్వారా రైతులు తమ బాధ్యత నిర్వహించాలి. ఆత్మహత్యలకు పాల్పడకుండా ముందుకు సాగాలి. తెలంగాణ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలి. దీనికితోడు సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడితే పురుగుమమందుల బాధలు కూడా తప్పుతాయి. ఇవన్నీ అందిపుచ్చుకుని ముందుకు సాగి బంగారు పంటలు పండించడానికి నడుం బిగించాలి. అప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది.