ఇది పెనుసవాలే..

– రెండో ప్రపంచ యుద్ధం నాటికన్నా దారుణం

– ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యం

– యూఎన్ నివేదిక విడుదల సందర్భంగా గుటెర్రస్ వ్యాఖ్య

జెనీవా, ఏప్రిల్ 1(జనంసాక్షి): కరోనా మహమ్మారి.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎదురైన అతిపెద్ద సవాల్ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రస్ అన్నారు. నోవెల్ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడనున్నట్లు ఆయన అంచనా వేశారు. ఆ మాంద్యం ఎంతలా ఉంటుందంటే, ఇటీవల కాలంలో అలాంటి మాంద్యం ఎప్పుడూ ఏర్పడలేదన్నారు. మహమ్మారి వల్ల సామాజిక ఆర్థిక వ్యవస్థలు ఎలా ప్రభావితం అవుతాయన్న యూఎన్ నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా గుటెర్రస్ మాట్లాడుతూ.. కరోనాను మరింత దూకుడుగా ఎదుర్కోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 8.50 లక్షలు దాటింది. సుమారు 42వేల మంది మరణించారు. మరణాల సంఖ్యలో చైనాను అమెరికా దాటేసింది. కోవిడ్ 19 వ్యాధి వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, దీని వల్ల అస్థిరత ఏర్పడుతుందని, అశాంతి వ్యాపిస్తుందని, ఘర్షణలు పెరుగుతాయని యూఎన్ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. 75 ఏళ్ల ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఇంత పెద్ద గ్లోబల్ హెల్త్ సంక్షోభాన్ని ఎదుర్కోలేదన్నారు. ప్రజల ప్రాణాలను తీస్తున్నదని, వ్యాధితో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రపంచ దేశాలు స్పందించాలన్నారు. డబ్ల్యూహెచవో సూత్రాలను చాలా వరకు దేశాలు గౌరవించడం లేదన్నారు. జెనీవా కార్యాలయ సిబ్బందికి కరోనా ఐక్యరాజ్యసమితిలోనూ కరోనా రక్కసి ప్రవేశించింది. మార్చి 30 నాటికి జెనీవా కార్యాలయంలో పనిచేస్తున్న 9మందికి కరోనా సోకినట్లు ప్రకటించింది. వెంటనే ఆఫీస్ నుంచి సిబ్బందిని ఖాళీ చేయించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. స్థానిక స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్-19 పై పోరుకు పనిచేస్తామని తెలిపారు.