ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు
నిజామాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పట్టుపడిన వాహనాలను జప్తు చేయాలని రాష్ట్ర గనులు, ఖనిజ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో అక్రమ రవాణాకు అలవాటు పడి చిన్నపాటి జరిమానాలతో తమ దందాను కొనసాగిస్తున్న అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాహనం పట్టుబడితే ఇకపై విడిపించడం కష్టంగా మారనుంది. అక్రమంగా ఇసుకను తరలిస్తూ దొరికే వాహనాలను జప్తు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. దీని పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా అధికారులకు  ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఇక తనిఖీలు ముమ్మరం చేయానున్నారు. జిల్లా నుంచి ప్రధానంగా ఇసుక రవాణాకు అవకాశమున్న వాగులు,వంకలవద్ద కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇసుకను తరలిస్తూ పట్టుబడిన వాహనాలను సీజ్‌ చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇసుకాసురుల్లో గుబులు మొదలైంది. జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలు, వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న దళారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా మారడంతో అక్రమార్కుల సంఖ్య రోజురోజుకూ పెరిగింది. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణాలకు ఇసుకను పెద్దమొత్తంలో వినియోగిస్తారు. ఇసుకను అక్రమంగా తరలించే వాహనం మొదటిసారిగా పట్టుపడితే ఐదు వేలు, రెండోసారి దొరికితే 15 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇదే వాహనం మూడో సారి ఇసుకను అక్రమగా తరలిస్తే సీజ్‌ చేస్తారు. ఇసుకను అక్రమంగా తరలించే లారీలపై సైతం ఈ జీవో ప్రకారం కఠిన చర్యలుంటాయి. పది
టన్నుల సామర్థ్యం కలిగిన లారీ మొదటిసారి దొరికితే రూ.25 వేలు, రెండోసారి పట్టుకుంటే రూ.50 వేలు జరిమానా, మూడోసారి వాహనాన్ని సీజ్‌ చేస్తారు. పది టన్నులకు మంచి సామర్థ్యం కలిగిన లారీ
మొదటిసారి పట్టుబడితే రూ.50 వేల రెండో సారి లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఇదే వాహనం మూడో సారి పట్టుబడితే సీజ్‌ చేస్తారు. ఇకపై నుంచి ఈ నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పట్టుపడిన వాహనాలను జప్తు చేయాలని రాష్ట్ర గనులు, ఖనిజాల శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.