ఇసుక పేరుతో తెదేపా నాటకాలు

– వరదల కారణంగానే ఇసుక సమస్య తలెత్తింది
– ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ, నవంబర్‌14 (జనంసాక్షి)  : ఇసుక సమస్యను అడ్డం పెట్టుకొని తెదేపా, జనసేన పార్టీలు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ..  తెదేపా ప్రభుత్వ హయాంలోనే రూ. వేలకోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇటీవల వరదల కారణంగా ఇసుక తీసే అవకాశం లేకపోవడంతోనే సమస్య తలెత్తిందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వివరించారు. మరో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయినా ఇసుక దీక్ష పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
ఇసుక మాఫియాతో దోపిడీకి పాల్పడిన చంద్రబాబుకు అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల పేర్లను ప్రస్తావిస్తూ తెదేపా జారీ చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపించాలని కమిషనర్‌ను కోరారు. తమ పార్టీ వారి ప్రమేయం ఉందని తేలితే కేసులు పెట్టాలని.. లేనిపక్షంలో తప్పుడు ఛార్జిషీటు జారీ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.