ఈటెల రాజేందర్‌ కుట్రలను తిప్పి కొట్టాలి

కేంద్రంలోని బిజెపి ఏంచేసిందని ఓటేయాలి
ఆస్తుల అమ్మకాలతో ప్రజలను మోసం చేస్తున్న బిజెపి
మంత్రిగా చేయలేని పనులు ఎమ్మెల్యేగా ఈటెల చేయగలడా
వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో విప్‌ బాల్క సుమన్‌
కరీంనగర్‌,సెప్టెంబర్‌30(జనం సాక్షి)  బిజెపి ఈటల రాజేందర్‌ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్‌
బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. సానుభూతి పొందేలా ఈటల డ్రామాలు చేసే అవకాశం ఉందని చెప్పారు. దళితబంధును కూడా ఆపాలని చూడడం దారుణమని అన్నారు. బిజెపి ఏం చేసిందో చెప్పాలన్నారు. కేంద్రం ఎందుకు వడ్లను కొననంటుందో చెప్పాలన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. గత పాలకులు దివ్యాంగుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో దివ్యాంగులందరికి పెన్షన్‌ అందుతున్నదని చెప్పారు. దివ్యాంగులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఇప్పిస్తామని హావిూ ఇచ్చారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.3016 పెన్షన్‌ అందుతున్నదా అని ప్రశ్నించారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బ్యాటరీ వాహనాలను అందిస్తున్నామని చెప్పారు. గెల్ల శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.
వికలాంగుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వాసుదేవరెడ్డి అన్నారు. వికలాంగులకు రూ.3016 పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ దళితులను లక్షాధికారు లను చేయాలని చూస్తే.. ఈటల ఓర్వలేకపోతున్నాడు. అలాంటి ఈటలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిరచాలి. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. అసహనంతో ఊగిపోతున్నాడు. తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడు. బీజేపీ గెలువక ముందే దళిత బంధును అపాలని చూస్తోందని అన్నారు.
దళితుల అసైన్డ్‌ భూములను బలవంతంగా గుంజుకున్నాడు. ఈటలకు దళితుల గోస తప్పకుండా తగులుతది. ఈటల రాజేందర్‌ రాజీనామా ఎందుకు చేశాడో హుజూరాబాద్‌ ప్రజలకు వివరించాలన్నారు. . ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలో లేక ఈటల బాగుపడాలో ఆలోచించాలని,ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమి చేయలేనోడు ప్రతి ప్రక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేస్తాడని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ కు వస్తున్న ఆదరణ చూసి బిజెపికి మతిపోతుంది. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి దళిత బంధును అమలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను లూటీ చేస్తోంది. గుజరాత్‌ నుంచి నలుగురు బయలుదేరి దేశాన్ని అమ్ముకుంటున్నారు. బీజేపీ అమ్మకానికి కేరాఫ్‌ గా మారితే టీఆర్‌ఎస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మకానికి కేరాఫ్‌ గా నిలిచిందన్నారు. రైతుల కష్టాన్ని తన కష్టంగా భావించి రైతు బంధును మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇస్తుంటే కేంద్రం ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని బాల్క మండిపడ్డారు.