ఈనెల 17వరకు అసెంబ్లీ సమావేశాలు

– 15రోజులు నిర్వహించాలని పట్టుబట్టిన విపక్షం

– అచ్చెన్నాయుడు, సీఎం జగన్‌ మధ్య ఆసక్తికర చర్చ

అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకు సాగనున్నాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీజేసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ ఉపప్రతిపక్షనేత అచ్చంనాయుడు హాజరయ్యారు. తొమ్మిది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. కనీసం 15రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో ఓ నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు పని దినాలు సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కాగా ఈనెల 9,10,11,12,13,16,17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆది రెండ్రోజులూ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించేందుకు స్పీకర్‌ నిర్ణయించారు. మరోవైపు సభలో రెడ్‌లైన్‌ ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగింది. రెడ్‌లైన్‌ పెట్టడం ద్వారా ఆ గీత దాటి స్పీకర్‌ పోడియం వైపుకు ఎరువు దూసుకొచ్చిన వారిని సభ నుంచి సస్పెండ్‌ చేసేలా ఓ నియమాన్ని పెట్టాలని భావించారు. కానీ సమావేశంలో ఆ అంశంపై చర్చకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఏసీ సమావేశానికి ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయడికి ఇటీవల జరిగిన కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీఏసీలో ఆరా తీశారు. ప్రమాదం గురించి అచ్చెన్నను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీఎంకు అచ్చెన్నాయుడు వివరించారు. తనకు స్వల్ప గాయాలు అయ్యాయని, ఇప్పుడు ఫర్వాలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. మా సీఎంకు విూపై ఎంతప్రేమ ఉందో చూడండని అచ్చెన్నను ఉద్దేశించి చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించగా.. నాకు మాత్రం సీఎం అంటే కోపమా?.. ఆయనకు, నాకు వ్యక్తిగతంగా ఏవిూ లేదు. మాది వేరే పార్టీ, విూది వేరే పార్టీ. అంత వరకే విభేదం అని అచ్చెన్నాయుడు జవాబిచ్చారు.