ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం అన్న రేణుక
ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ విజయం సాధించి రాహుల్‌ ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని  ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ దూసుకుని పోతోందని అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె పట్టణంలోని వివిధ
ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు ఓటేసి, బిజెపి దూరం పెట్టాలన్నారు. ఇచ్చిన హావిూలను నిలుపుకోవడంలో మోడీ విఫలమయ్యారని అన్నారు. అలాగే టిఆర్‌ఎస్‌ కూడా ప్రజల సంక్షేమాన్ని వీడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలుపుకోవడంలోనే బిజీగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని రేణుకాచౌదరి అభిప్రాయపడ్డారు.  ప్రజాస్వామ్య, లౌకికవాద పాలన కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్‌ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గత రెండు దశాబ్దాలుగా జిల్లా ఆడబిడ్డగా తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు రాజకీయ వారసులు లేరని, కార్యకర్తలు, ప్రజలే తన వారసులన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ, కేసీఆర్‌లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారన్నారు. అధికార పార్టీ పోలీసు చర్యలతో తనను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడినా కార్యకర్తలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని, కాంగ్రెస్‌ విజయబావుటా ఎగురవేస్తుందని రేణుకాచౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. విూ ఇంటి ఆడబిడ్డగా తనను గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని  వేడుకున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును నేరవేర్చుకోవటం కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా దేశానికి ప్రధాని అవుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. 16 సీట్లు కారు..సారు అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఎద్దేవా చేశారు. నైతిక విలువలను కోల్పోయిన నామా నాగేశ్వర రావు నేడు మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంగించే విధంగా, నమ్ముకున్న కార్యకర్తలను మోసగించేవిధంగా ప్రవర్తించి నేడు నామా పార్టీ మారారని ఆరోపించారు. తనను ఎంత రెచ్చగొడితే తాను అంత రెచ్చిపోతానని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. నోట్ల రద్దు, జీఎస్టీ పేరుతో దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు బీజేపీ ప్రభుత్వం గురి చేసిందని అన్నారు.