ఈ-నామ్‌కు ఎగనామం పెడుతున్న ట్రేడర్లు

మిర్చి రైతులకు చుక్కలు చూపిస్తున్న మార్కెట్లు

ఇంకా దృష్టి సారించని వ్యవసాయశాఖ మంత్రి

హైదరాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్‌ఇన ఈ -నామ్‌ విధానం అమలులో అభాసుపాలయ్యింది. పంటలకు ధరలు నిర్ణయించి ఎక్కడైనా అమ్ముకునేలా జాతీయ విధానం తీసుకుని వచ్చినా అమలులో అపసోపాలు పడుతోంది. ఎలక్టాన్రిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ పేరుతో దీనిని ప్రవేశ పెట్టారు. రైతు తాను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకొనేందుకు ప్రవేశపెట్టిన విధానం అభాసుపాలయ్యిందని గత రెండేళ్లుగా పరిశీలిస్తే అర్థం అవుతుంది. ట్రేడర్లు ఎక్కడైనా తనకు నచ్చిన సరకు కొనుగోలుకు కల్పించిన అవకాశం ఇది. మిరప కొనుగోళ్లలో వరంగల్‌, ఖమ్మం మార్కెట్‌లు ప్రథమ వరసలో ఉంటాయి కానీ ఈ-నామ్‌ విధానం లేదు. ఈ రెండు మార్కెట్‌లలో మిరప ట్రేడర్లు ఈ-నామ్‌ పద్ధతిలో కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదు. దీనికి తోడు ట్రేడర్లు కంప్యూటర్లు పనిచేయడం లేదన్న సాకుతో రైతుల ను బురిడీ కొట్టించేస్తున్నారు. మార్కెట్‌ పాలక మండలి లేకపోవడంతో కూడా ట్రేడర్ల ఇష్టారాజ్యానికి వేదికగా మారుతోందనే అభిప్రాయాలున్నాయి. ఈ-నామ్‌ ఆన్‌లైన్‌ విధానం కావడం, ఎలక్టాన్రిక్‌ బిడ్డింగ్‌, తక్‌పట్టీ ఆటోమెటిక్‌గా రావడం, సిండికేట్‌కు అవకాశం లేకపోవడం, రైతు తన లాట్‌ చూసుకొని ఏ ట్రేడర్‌ ఎక్కువకు బిడ్డింగ్‌ చేస్తే వాళ్లకు అమ్ముకొనే అవకాశం ఉండటంతో ట్రేడర్లు ఈ-నామ్‌ విధానంలో కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈ-నామ్‌ అమలైతే తమ ప్రభావం దగ్గుతుందని ట్రేడర్లు భావిస్తున్నారు. ప్రధానంగా వరంగల్‌ ఎనుమాముల,ఖమ్మం మార్కెట్లకు మిర్చి పోటెత్తుతున్నా ధరలు మాత్రం అందుకు

తగ్గట్లుగా ఉండడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఆందోళన చెందుతున్నా ఊరడించే అధికారులు కానరావడం లేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఇంకా దీనిపై దృష్టి సారించినట్లుగా లేరు. కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో లేదో తెలియడం లేదు. వివిధ వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్లు జరగుఉతన్న తీరు చూస్తుంటే మంత్రి ఇటువైపుగా దృష్టి పెట్టారని అనిపించడం లేదు. ప్రధానంగా వరంగల్‌, ఖమ్మం మార్కెట్లలో మిరప రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు మాయాజాలానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. మూడు, నాలుగు రోజులపాటు క్వింటా ధర పెంచి కొనుగోలు చేస్తూ ధర బాగుందని ప్రచారం చేస్తున్నారని, పెద్ద ఎత్తున సరకు రాగానే ఆ రోజున ధర అమాంతంగా తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జెండా పాట క్వింటాకు రూ.9,200 అన్నారు. తీరా సరకు చూసి రూ.8,800 ఇస్తామంటారు. బయటకన్నా ఎక్కువ ధర వస్తుందని మార్కెట్‌కు తీసుకొస్తే లాభం లేకుండాపోయిందన్న ఆవేదనలో రైతులు ఉన్నారు. జెండా పాట రూ.9,200 ఉంటే ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే తెల్లకాయ ఉందని చెబుతున్నారు. కవిూషన్‌ కూడా ఇష్టానుసారంగా తీసుకుంటున్నారని వాపోతన్నారు. తొలుత రైతు వద్దకు వచ్చి సరకుకు మెరుగ్గానే ధర నిర్ధరిస్తారు. తూకం వేసే సమయంలో తాలు ఎక్కువ ఉందని, కాయ తెల్లబడిపోయిందని రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించేస్తున్నారు. అప్పటికే రెండుమూడు రోజులు మార్కెట్‌లో ఉన్న రైతు ఇక ఓపిక లేక సరకు అమ్మేసుకొనే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలుసు. వారు కూడా దళారులతో వ్యాపారులతో కమ్మక్కు అవుతున్నవారే.