ఉక్కు ఫ్యాక్టరీయే దిక్కు చిత్తశుద్ది లేని కేంద్రం: సిపిఐ

కడప,సెప్టెంబర్‌13(జనంసాక్షి):ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ నాయకుడు  ఈశ్వరయ్య  విమర్శించారు. ఒక్క ఉక్కు పరిశ్రమ వచ్చినా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దక్కేదని అన్నారు. రాయలసీమ నుంచి ఎందరో నాయకులు ఆత్యున్నత పదవులు అనుభవించినా సీమకు ఎంత మాత్రం న్యాయం చేయలేదని అన్నారు. కరువు సీమను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని  విమర్శించారు.  జిల్లా నుంచి ఎందరో పదువులు పొందారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు మాత్రమే నిరంతరం రైతుల సమస్యలపై పోరాడుతున్నారని  అన్నారు. అలాంటి నాయకులు నేడు చట్టసభల్లో లేకపోవడం విచాకరం అన్నారు. జిల్లాలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో చంద్రబాబునాయుడు ఏమాత్రం శ్రమించిన దాఖలాలు లేవన్నారు. జమ్మలమడుగు వద్దిరాల వద్ద ఏసీసీ వారు సిమెంటు కర్మగారం నిర్మిస్తామని చెప్పి 14 ఏళ్ల క్రితం రైతుల నుంచి భూములు తీసుకున్నారు. కానీ ఎలాంటి కర్మగారం నిర్మించలేదు, రైతులకు భూములు తిరిగి ఇవ్వలేదన్నారు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. పంటల రక్షణకు  జల ఫిరంగుల ద్వారా రక్షిస్తామని చంద్రబాబు ఆర్భాటం చేశారన్నారు. ఆచరణలో ఒక్క ఎకరా కూడా రక్షించలేదన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు. జిల్లాలో కరువును పారదోలే వరకు రైతుసంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. రైతులకు ఎకరాకు రూ.20 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.