ఉగ్రదాడికి ముందు..  ఘాజీతో టచ్‌లోనేఉన్నాం

– విచారణలో వెల్లడించిన పోలీసుల కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు
శ్రీనగర్‌, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రెండు రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లో జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను యూపీ ఉగ్రవాద నిరోధక దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు సంచరిస్తున్నారానే నిఘావర్గాల హెచ్చరికలతో సహారన్‌పూర్‌ జిల్లా దేవబంద్‌ ప్రాంతంలో కశ్మీర్‌కు చెందిన షానావాజ్‌ అహ్మద్‌ తెలి, అఖిబ్‌ అహ్మద్‌ మాలిక్‌లను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడి సూత్రధారి అబ్దుల్‌ రషీద్‌ ఘాజీతో తాము టచ్‌లో ఉన్నట్టు విచారణలో వీరు వెల్లడించారు. పుల్వామా దాడికి జరిగిన నాలుగు రోజుల్లో ఎన్‌కౌంటర్‌లో ఘాజీని భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం విదితమే. పట్టుబడ్డ తీవ్రవాదుల్లో ఒకరైన షాన్‌వాజ్‌ తెలి మొబైల్‌కు ఉగ్రదాడి గురించి వాయిస్‌ మెసేజ్‌ వచ్చినట్టు విచారణలో వెల్లడయ్యింది. ఫోన్‌ సంభాషణల ఆధారంగా ఈ ఇద్దరూ కలిసి ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలతో భారీ దాడికి వ్యూహరచన చేసినట్టు తేలింది. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు నిందితులు అంగీకరించారని డీజీపీ ఓపీ సింగ్‌ వెల్లడించారు. వీరిని నాలుగు గంటలపాటు విచారించామని, ఉగ్రవాద కార్యకలాపాలతో ఇద్దరికీ ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని ఆయన అన్నారు. అనంతరం ఈ వివరాలను కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌కు అందజేశామని, త్వరలోనే మరింత సమాచారం బయటకు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ఏడాదిన్నరగా ఉగ్రవాద సంస్థలతో తనకు సంబంధాలున్నాయని, అఖిబ్‌ ఆరు నెలల కిందటే తమ గ్రూప్‌లో చేరాడని షానవాజ్‌ వెల్లడించిన విషయాన్ని ఏటీఎస్‌ ఐజీ అసిమ్‌ అరుణ్‌ వివరించారు. అబ్దుల్‌ ఘాజీతోనూ షాన్‌వాజ్‌ నిరంతరం టచ్‌లో ఉండటమే కాదు, ఇద్దరూ జైషే మహ్మద్‌ అగ్రనేతలతోనూ మాట్లాడినట్టు గుర్తించారు. వీలైనంత త్వరలో కొన్ని ఆయుధాలను సేకరిస్తామని మొబైల్‌ ద్వారా పంపిన వాయిస్‌ మెసేజ్‌లు బయటపెట్టాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయుధాలు ఎక్కడ నుంచి తీసుకోవాలనే ప్రదేశాల గురించి కూడా ఇందులో స్పష్టం చేశారని ఏటీఎస్‌ ఐజీ తెలియజేశారు. ఈ ఇద్దరూ బీబీఎం ద్వారా సందేశాలను పంపి, తాము మాట్లాడే అవతలి వ్యక్తులను కనిపెట్టకుండా ఉండటానికి వర్చువల్‌ నెంబర్లు కూడా ఉపయోగించారని, కశ్మీర్‌లో మరికొంత మంది యువకులను తీవ్రవాదులుగా మార్చి, వారికి శిక్షణ ఇవ్వడానికి నకిలీ గ్రెనేడ్లను దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుల్గామ్‌కు చెందిన షాన్‌వాజ్‌ డిగ్రీ మొదటి ఏడాది చదవగా, తండ్రి కార్పెంటర్‌, అన్న ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పుల్వామాకు చెందిన ఓ రైతు కుమారుడైన అఖిబ్‌ ఇంటర్‌ చదివినట్టు తెలిపారు.