ఉగ్రవాదానికి పాక్‌ ఊతం

5

– ప్రపంచశాంతిని కాపాడుకుందాం

– లావోస్‌ ఏషియాన్‌ సదస్సులో మోదీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): ఉగ్రవాదమే ఇవాళ ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి ఇదో సవాల్‌గా మారిందన్నారు. ఒక దేశం నుంచి మన దేశాలకు వ్యాపిస్తున్న ఉగ్రవాదమే మనందరి ప్రధాన సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పరోక్షంగా ఆయన పాక్‌ ఇందుకు బాధ్యత వహించాలని అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో జరుగుతున్న 14వ ఆసియాన్‌- ఇండియా సదస్సులో గురువారం ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, ఉగ్ర భావజాలం, హింస ఇతర దేశాలకు వ్యాపించేలా చేస్తున్నారు’ అని పాక్‌నుద్దేశించి మోదీ అన్నారు. దీనిపై కలిసికట్టుగా సమష్టి కృషి చేయాలని ఆసియాన్‌ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీపై పోరాడేందుకు భారత్‌ చర్యలు తీసుకోవాలని భావిస్తోందని, దీనికి ఆసియాన్‌ దేశాలు కూడా మద్దతివ్వాలని కోరారు. భారత్‌లో టెర్రరిజంపై పోరాడానికి కటవుగా వ్యవహరిస్తున్నామని అన్నారు.  ప్రధాని మోదీ పాక్‌పై వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇటీవల చైనాలో జరిగిన జీ20 సదస్సులోనూ మోదీ.. పాక్‌ వైఖరిపై పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియాలోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంపొదిస్తోందని మోదీ ఆ సమయంలో చెప్పారు. ఉగ్రవాద ఎగుమతి ఆందోళనకరంగా మారిందని, దీంతో ఈ ప్రాంతానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్మొహమాటంగా హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని ఆయన పిలిపునిచ్చారు. ద్వేషాన్ని, హింసను ప్రోత్సహిస్తూ పెరిగిపోతున్న ఉగ్రవాదంతో అన్ని దేశాలకు భద్రత ముప్పు పొంచి ఉందని మోదీ అన్నారు. ఈ ముప్పు స్థానికంగా, ప్రాంతీయంగా.. తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరివర్తనం చెందుతోందని, దీనిని ఏషియాన్‌ దేశాలు పరస్పర సహకారంతో ఎదుర్కోవాలని స్పష్టంచేశారు. సాంప్రదాయ, సాంప్రదాయేతర సవాళ్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో దేశాల మధ్య రాజకీయ సహకారం అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. కౌంటర్‌ టెర్రరిజం, సైబర్‌ భద్రత పెంచే దిశగా తాము అడుగులు వేస్తున్నామని మోదీ చెప్పారు. రెండు రోజుల కిందట జీ20 సమావేశంలోనూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి దక్షిణాసియాలో ఒక్క దేశమే ఉగ్రవాదానికి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏషియాన్‌ సదస్సులోనూ పాక్‌ తీరును ఎండగట్టారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ స్పష్టంచేశారు. ఏషియాన్‌ దేశాల మధ్య డిజిటల్‌ కనెక్టివిటీ కోసం మాస్టర్‌ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నామని కూడా ఆయన చెప్పారు. సముద్రాలను రక్షించుకోవడం కూడా మనందరి బాధ్యతని, ప్రపంచ వాణిజ్యానికి సముద్రాలే జీవన రేఖలని మోదీ అన్నారు.