ఉగ్రవాదుల ఏరివేతలో వెనకడుగు లేదు

గవర్నర్‌ పాలనతో ఆపరేషన్‌కు ఎలాంటి అడ్డంకి లేదు

స్పష్టం చేసిన ఆర్మీ చీఫ్‌ రావత్‌

శ్రీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): జమ్మూ కశ్మీర్‌ విధించిన గవర్నర్‌ పాలన వల్ల సైనిక ఆపరేషన్లపై ప్రభావం పడబోదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ సింగ్‌ రావత్‌ పేర్కొన్నారు. సైన్యంపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గవర్నర్‌ పాలనకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే ఆర్మీ చీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రంజాన్‌ సందర్భంగా మాత్రమే తాము సైనిక ఆపరేషన్లు నిలిపివేశాం. దీనివల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయో మనందరికీ తెలుసు. గవర్నర్‌ పాలన విధించడం వల్ల మా ఆపరేషన్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇంతకు ముందులాగానే మా ఆపరేషన్లు కొనసాగుతాయి. మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు…అని జనరల్‌ రావత్‌ వెల్లడించారు.పవిత్రమాసం రంజాన్‌ సందర్భంగా రాష్ట్రంలో ఉగ్రవాదుల గాలింపు నిలివేస్తూ గత నెల 17న కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెలరోజుల్లో ఓవైపు సైనికులు కాల్పుల విరమణ పాటించగా… ఉగ్రవాదులు మాత్రం విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో సైనికులు, పౌరులను బలితీసుకున్నారు. దీంతో రంజాన్‌ సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణకు ముగింపు పలుకుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అమలు చేయడం ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌సింగ్‌ రావత్‌ స్పష్టం చేశారు. తమ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. రంజాన్‌ సందర్భంగానే తాము ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను నిలిపివేశామని, అయితే పాక్‌ నుంచి కవ్వింపు చర్యలు ఎదురవడంతో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణం ప్రభుత్వం కుప్పకూలిన మరుక్షణమే గవర్నర్‌ పాలన విధించారు. రంజాన్‌ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పునరుద్ధరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. వేర్పాటువాదులకు మరికొంత సమయం ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ కోరుతుండగా, వేర్పాటువాదులకు ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చామని, అయితే వారు సానుకూలంగా స్పందించడంలో విఫలమయ్యారని బీజేపీ వాదిస్తోంది.