ఉచిత విద్యుత్‌ పథకం దుర్వినియోగం

చాటుమాటున ఇటుక బట్టీల నిర్వాహణ
హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): 24 గంటల ఉచిత విద్యుత్‌ కొందరికి వరంగా మారింది. ముఖ్యంగా రైతుల పొలాలను కౌలుకు తీసుకున్న పలువురు అనేకచోట్ల ఇటుకబట్టీలు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.  ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుని ఇటుక బట్టీల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.ఇటుక బట్టీల
నిర్వహణకు అవసరమైన నీటిని, విద్యుత్‌ను ఉచితంగా పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సవిూప వ్యవసాయ భూములు, బోరుమోటార్లను లీజుకు తీసుకుంటూ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తున్నారు.  ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసివస్తోంది. రైతుల సేద్యానికి ప్రభుత్వం బోరుమోటార్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుండగా దీనిని ఇటుక బట్టీ వ్యాపారులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా బట్టీలు నిర్వహిస్తూ వ్యవసాయ భూములను వాడుకుంటున్నారు. జిల్లాలో విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్న ఇటుకబట్టీ వ్యాపారులు చాలా తక్కువగా ఉంటారు. ఇందులోనూ సంబంధిత విద్యుత్‌ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి పబ్బం గడుపుకొంటున్నారు. వ్యాపారులు ఇటుకల తయారీ కేంద్రం వద్ద బోరుమోటారు వేసుకుని దానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని సర్వీసు కనెక్షన్‌ పొందాల్సి ఉండగా   అందుకు విరుద్ధంగా  వ్యవహరిస్తున్నా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లక్షల్లో  విలువైన వ్యవసాయ ఉచిత విద్యుత్‌ దుర్వినియోగం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం పలు శాఖల అనుమతుల మేరకే వీటిని నిర్వహించాల్సి ఉండగా వ్యాపారులు నిబంధనలకు గాలికి వదిలేస్తున్నారు. లాభసాటి వ్యాపారం కావడంతో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లాగా అక్రమంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.  భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో అందరి దృష్టి ఈ వ్యాపారంపై పడింది.  ఏజెన్సీలో వీటి నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రైతులను మచ్చిక చేసుకొని కొంత డబ్బును ముట్టజెప్పి పొలాన్ని లీజు రూపంలో తీసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో జోరుగా ఇటుక బట్టీల వ్యాపారం సాగుతోంది.  బట్టీల నిర్వహణకు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. అటవీ ప్రాంతాలకు సవిూపంలో వ్యవసాయ భూముల్లో నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను వినియోగించవద్దన్న నిబందనలు బేఖాతరుచేస్తూ  గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంత డబ్బును ముట్టచేప్పి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఆ భూములను వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నందుకు నాలా సుంకం చెల్లించాలి. భూగర్భ, గనుల శాఖ నుంచి సైతం అనుమతులు పొందాలి. ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతం, వాగులు చెరువుల నుంచి వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వుతూ ఇటుకల కోసం మట్టిని తరలిస్తున్నారు. వీటిని పరిశీలించి మండలాల స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ సిబ్బంది మామూళ్లకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదు. ఇటుకబట్టీల నిర్వహణపై దాడులు చేస్తే వీరి ఉల్లంఘనలు బయటపడగలవని స్థానికులు అంటున్నారు.