ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన


సహాయక హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి
డెహ్రాడూన్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి):  వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యవసర వస్తువులు తరలిస్తున్న హెలికాప్టర్‌.. పవర్‌ కేబుల్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ చాపర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ కప్తాల్‌ లాల్‌, కోపైలట్‌ శైలేష్‌ తో పాటు స్థానిక నివాసి రాజ్‌ పాల్‌ మృతి చెందారు. ఉత్తరకాశీలోని మోరీ నుంచి మోల్దీకి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉత్తరకాశీలోని టోన్స్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌.. ఉత్తరకాశీలోని వరద ప్రభావిత ప్రాంతాలను నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా సహాయకచర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఉత్తరకాశీని వరుణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో గ్రామాలు అతలాకుతల మయ్యాయి. గత వారం కురిసిన వర్షాలకు 16 మంది చనిపోయారని జిల్లా అధికారులు తెలిపారు. వర్షాల ధాటికి 70 ఇళ్లు కూలిపోగా.. 115 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నాలుగు వంతెనలు ధ్వంసమయ్యాయి.
14కివిూ.ల మేర విద్యుత్‌ స్తంభాలు నేలకూలిపోయాయని అధికారులు చెప్పారు.