ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

– ఏడుగురు మృతి
డెహ్రాడూన్‌, జులై11(జ‌నం సాక్షి) : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. డెహ్రాడూన్‌లోని సీమద్వార్‌ వద్ద గోడ కూలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ముగ్గురు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. కుండపోత వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడటంతో పలు రహదారులను మూసివేశారు. జాతీయ రహదారి -94పై రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పితోర్‌ఘర్‌లో బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధికారులకు ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సెలవులను రద్దు చేశారు. అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.
——————————–