ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి కసరత్తు?

గోదావరిఖని,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): వరుసగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణి సంస్థ ఈ ఏడాది అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కన్నా 10 శాతం వృద్ధి రేటును సాధించాలని  భావించింది. అయితే కొన్ని గనులు అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. సింగరేణిలో రెండు ఏరియాల తప్ప మిగిలినవన్నీ లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లక్ష్యాన్ని సవరించడం మినహా మరో అవకాశం యాజమాన్యానికి లేకుండా పోయింది. ఉత్పత్తి లక్ష్యం సాధించేక్రమంలో ఉత్పత్తి లక్ష్యాన్ని  సవరించాలనే దిశగా పావులు కదుపుతోంది. సింగరేణిలో 2014-15లో కూడా ఉత్పత్తి లక్ష్య సవరణ జరిగింది. ఆ సంవత్సరం 56 మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకోగా కష్టసాధ్యంగా మారడంతో దాన్ని 54 మిలియన్‌ టన్నులకు సవరించారు. అందుకే యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యాలను సవరించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు చూస్తే అనుకున్న లక్ష్యం కన్నా తక్కువగా.. అంటే 91 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని మాత్రం సాధించింది.  గతంతో పోలిస్తే అంత ఒత్తిడి లేకపోవడంతో ఉత్పత్తిలో వెనకంజ వేయడం మొదలైంది. అన్ని ఏరియాల కన్నా మందమర్రి ఏరియా అతితక్కువ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది.  ఆర్థిక సంవత్సరం మధ్యకాలం నుంచి కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి వస్తుందనే అంచనాలతో వాటి ఉత్పత్తి లక్ష్యాలనూ కలుపుకొని లక్ష్యం నిర్ణయించారు. కొత్త గనులు రాకపోవడంతో అధికారులు అంచనాలు తారుమారై దిద్దుబాటు చర్యలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం.