ఉద్యాన పంటలకు ప్రోత్సాహం

కూరగాయల సాగుతో మేలైన లాభాలు
సబ్సిడీపై ఎరువులు, పరికారల పంపిణీ
మేడ్చల్‌,మే18(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా హైదరాబాద్‌ నగరంలో భాగంగా విస్తరించి ఉండటంతో సాధారణంగా ఉద్యానవన పంటలకు నగర ప్రజల నుంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యానవన పంటల సాగుపై జిల్లా హార్టికల్చర్‌ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బిందు సేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీ, రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీపై అందింస్తున్నారు. అలాగే తీగజాతి పంటల సాగుకు పందిళ్ల ఏర్పాటుకు 50 శాతం రాయితీ
అందిస్తున్నట్లు హార్టికల్చర్‌ అధికారులు తెలిపారు. అయితే ఉద్యాన పంటల సాగులో నాణ్యమైన విత్తనా లను వినియోగిస్తేనే అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుందని, విత్తనాల కొనుగోలు సందర్భంలో రైతులు నిపుణులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల పంటలతో ప్రయోజనాలు పొందవచ్చని, లాభాలు కూడా ఉంటాయన్నారు. రానున్న వానాకాలం పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. పంట తీరును బట్టి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అయితే వరి పంటకన్నా, ఆరు తడి పంటలను సాగు చేస్తేనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి శోభారాణి తెలిపారు. వరిసాగు చేసే రైతుల్లో కొంత మంది రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వరికి బదులుగా స్వీట్‌కార్న్‌, బేబీకార్న్‌, మొక్కజొన్న, కంది, పెసర, జొన్నలు, రాగి, నువ్వులు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగులో పాటించే పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. వీటిలో ప్రధానంగా నారుపెంచి నాటే పద్ధతితో అధిక ప్రయోజనాలను పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అత్యుత్తమ పంట దిగుబడిని సాధించిన గ్రామాలను, రైతుల వ్యవసాయ భూములను ఇతర రైతులు సందర్శించేందుకు ప్రభుత్వ పరంగా అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా రైతులకు అందించాల్సిన సహకారం, భూసార పరీక్షలు, భూగర్భజలాలు, వ్యవసాయ రుణాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, హరితహారం ప్రయోజనాలు, ఆరుతడిపంటలతో అధిక దిగుబడుల వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.