ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరణ?

వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు చర్యలు
వరంగల్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే ఉద్యోగుల వివరాలను భవిష్యత్‌లో తెలుసుకునేలా యూనిక్‌ ఐడి కేటాయిస్తారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు  వివరాల సేకరణ చేపట్టారని సమాచారం. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఐదు జిల్లాలుగా విభజన అయింది. కొత్తగా ఇప్పుడు ములుగు వచ్చి చేరింది. ఇందులో పాత వరంగల్‌ జిల్లా పరిధిలో పనిచేసే చేర్యాల, కొమురవెల్లి,మద్దూరు మండలాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్దిపేట జిల్లాకు, ఇటు నల్గొండ జిల్లా గుండాలలో పనిచేసే వారంతా ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లా పరిధిలోకి మారారు. పైగా ఇది వరకు జిల్లా కేంద్రంలో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులను కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సమానంగా పంపిణీ చేశారు. ఆయా విభాగాల వద్ద ఉద్యోగుల సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇది కొత్తగా పాలన సాగిస్తున్న యంత్రాంగానికి కొంత ఇబ్బందికరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం అన్నిరకాల ఉద్యోగుల వివరాల సేకరణలో నిమగ్నమైంది.  మొత్తం ఉద్యోగుల సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. మొత్తం 31 అంశాలతో కూడిన ఉద్యోగుల సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ ఎంప్లాయి డేటాషీట్‌ను తయారు చేసింది. ఇందులో ఉద్యోగి ఫొటోతోపాటు కుటుంబ నేపధ్యం, సభ్యుల సంఖ్య, వేతనం, నివాసం, చదువు, ఉద్యోగంలో చేరిన తేదీ, పదోన్నతులు, డిప్యూటేషన్‌, ఆధార్‌, పాన్‌కార్డు, పీఆర్‌సీ, రుణాలు, సెలవులు వంటి అంశాలు ఉన్నాయి. ఇలా మార్పులు, చేర్పుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా ఫైనాన్స్‌, ట్రెజరరీ విభాగాల్లో వివరాలను తీసుకుంటుంది. వాటిని ధ్రువపరిచేందుకు జిరాక్స్‌ ప్రతులను కూడా ఈఫార్మెట్‌ వెంట జత చేయాల్సి ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల వేతనాలకు డీడీవో ప్రతినెల సంబంధిత ఎస్‌టీవో కార్యాలయాలకు వివరాలను పంపిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల వివరాలను డీడీవోల ద్వారానే సేకరించాలని నిర్ణయించింది. 31అంశాలకు సంబంధించిన వివరాలను ఉద్యోగులు పూర్తి చేసి డీడీవోకు అందజేస్తే వారు ఆ వివరాలను తమ పరిధిలోని ఖజానా కార్యాలయాల్లో అందజేస్తారు. జిల్లా ట్రెజరరీ కార్యాలయం ద్వారా సేకరించిన ఉద్యోగుల వివరాలను కంప్యూటీకరణ చేయడం ద్వారా ఉద్యోగి ఐడీ నంబర్‌ క్లిక్‌ చేస్తే క్షణాల్లో సదరు ఉద్యోగి సమగ్ర సమాచారం ప్రత్యక్షం అవుతుంది.