ఉపరితల ఆవర్తనంతో వడగాలుల ప్రమాదం

ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు
విశాఖపట్టణం,మే20(జ‌నంసాక్షి):  కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోవిూటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయని, దీంతో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎండలో బయటకు వెళ్లరాదని,జగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడిమికి తట్టుకోలేక జనం బయటకు రావడానికి జంకుతున్నారు. అత్యధికంగా పెద్దపల్లిలో 45.8, కరీంనగర్‌లో 45.7, మహబూబాబాద్‌లో 45.2, సంగారెడ్డి, మెదక్‌లో 45.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వేడిగాలులు వీస్తుండటంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నగరంలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 29.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ 17 శాతానికి పడిపోవడంతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నా రు.  హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎండవేడిమి తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురు, ఉమ్మడి ఖమ్మంలో ఇద్దరు, రంగా రెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు, శాయంపేట, రాయపర్తి, గీసుగొండ, నర్సంపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. శాయంపేట మండలంతోపాటు పత్తిపాకలో రాళ్ల వాన పడింది. శాయంపేట మత్స్యగిరిస్వామి గుడి సవిూపంలో కారుపై చెట్టు పడింది. అరటి తోటలు నేలకూలగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేటలో గంటపాటు వర్షం పడింది.
దక్షిణ ఇంటిరీయర్‌ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోవిూటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 ఎత్తు వ ద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి వల్ల రాగల మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని, అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.