ఉపాధి కింద కూడా చెరువు పనులు : కలెక్టర్‌

కరీంనగర్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద ఎంపిక కాని  చెరువుల పూడికతీత పనులను ఉపాధి కింద చేపట్టాలని నిర్ణయించారు.  ఈ మేరకు కలెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌ అధికారులకు ఆదేవౄలు ఇచ్చారు. మిషన్‌ కాకతీయ కింద మంజూరు కానీ చెరువులలో ఉపాధి హావిూ కింద పూడికతీత పనులను కూలీలతో చేయించాలని సూచించారు. ఈ పథకం కింద గ్రామాలలో పశుగ్రాసం పెంపకానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. చెరువులను గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేస్తే అందుకు అనగుణంగా పాలనా అనుమతులు ఇస్తామన్నారు. పశువుల కోసం తాగునీటి తొట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపాధి హావిూ కింద ఓపెన్‌ వెల్స్‌ లోతు పెంచడానికి పనులను చేపట్టవచ్చని, మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.  నర్సరీలలో హరితహారం పథకం కింద పెంచుతున్న చెట్లకు ఉదయం, సాయంత్రం నీరు పట్టాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కలుపుతీయాలని ఆదేశించారు. హరితహారం లబ్దిదారులను వెంటనే ఎంపిక చేసి పంపాలన్నారు. మిషన్‌ కాకతీయ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. పథకంలో భాగంగా చెరువులలోని చెట్లను, ఆక్రమణలను తొలగించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువు కట్టలపైన హరితహారం పథకం కింద చెట్లను పెంచడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. హరితహారంలో గోడలేని స్మశానాలకు చెట్లు రక్షణగా నిలుస్తాయని, నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని వివరించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, తెలిపారు. అవసరమైన ప్రాంతాలలో తాగునీరు సరఫరా చేయాలన్నారు. బోరుబావుల మరమ్మతులు, కడిగేందుకు ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.