ఉపాధి కూలీలతో మంత్రి ముచ్చట్లు

కూలీ సమయానికి వస్తుందా అని ఆరా
వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. మార్గమద్యలో వెళుతున్న ఆయన ఉపాధి కూలీల్లో జోష్‌ నింపారు. వరంగల్‌ ఎంజీఎంలో సిటీ స్కాన్‌ ని ప్రారంభించిన అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరుకు బయలుదేరారు.
మార్గమధ్యంలో పర్వతగిరి మండలం తుర్కల సోమారం గ్రామం నల్లకుంట తండా వాసులు తమ చెరువులో పూడికతీత పనులు చేస్తున్న దృశ్యాన్ని మంత్రి చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి కూలీల దగ్గరకు వెళ్లారు. ఉపాధి హావిూ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఉపాధి కూలీల సమస్యలు ఎమైనా ఉన్నాయా? అని అడిగారు. ఉపాధి హావిూ బిల్లులు సకాలంలో వస్తున్నాయా? ఎంత కాలంగా రాలేదు? అని ఆరా తీశారు.
ప్రతి రోజూ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పని చేస్తున్నారు? అని అడిగారు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి గడ్డ పార అందుకున్నారు. పక్కనే కూలీలు వేస్తున్న మాదిరిగానే గడ్డపార వేసి, మట్టి పెళ్లలను పెకిలించారు. తట్ట పట్టి మట్టి ఎత్తి కూలీల్లో నూతనోత్తేజాన్ని నింపారు.