ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాం

– అఖిలేష్‌

లక్నో ,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):నకిలీ సమాజ్‌ వాది పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం పార్టీ వార్షిక సమావేశం జరిగిన సందర్భంగా మరోసారి నరేశ్‌ ఉత్తమ్‌ను ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా పార్టీ నేతలు, కార్యకర్తలు మరోసారి తమ బాధ్యతలను గుర్తించాలని సూచించారు. గోరఖ్‌పూర్‌, పుల్పూర్‌ స్థానాలు ఖాళీ అయ్యాయని, ఉప ఎన్నికల్లో వాటిని సమాజ్‌వాది పార్టీ ఖాతాలో వేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ రెండు స్థానాల్లో ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య గతంలో గెలిచి ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని ముందుకెళ్లాలని అఖిలేశ్‌ కోరారు. ‘నకిలీ సమాజ్‌వాదీల నుంచి జాగ్రత్తగా ఉండండి. సమాజ్‌వాది ఉద్యమాన్ని ఆపేందుకు వారు గతంలో పలు విధాలుగా ప్రయత్నించారు. వారు చేసిన ఒక కుట్రలో విజయం సాధించారు. అందుకే మనం ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయాం. అలాంటి అవకాశం ఇక మళ్లీ ఇవ్వొద్దు. నేతాజీ(ములాయం) తన తండ్రి అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయి. ఈ ఉద్యమాన్ని మేం కలిసి ముందుకు తీసుకెళతాం’ అని అఖిలేశ్‌ చెప్పారు.