ఉమ్మడి జిల్లాలో నారీభేరీ

అత్యధిక స్థానాల్లో మహిళా సర్పంచ్‌లే

ఆదిలాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నారీభేరి మోగింది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో కాకుండా జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు సత్తా చాటారు. రిజర్వేషన్లు కాకుండా 28 గ్రామ పంచాయతీల్లో మహిళలు గెలవడం ఆశ్చర్య పరిచింది. ఇది రాజకీయంగా వారిలో ఉన్న ఉత్సాహాన్ని నింపింది. తొలి విడతలో భాగంగా 511 గ్రామపంచాయతీల్లో 50శాతం మహిళలకు రిజర్వు కోటా కాగా.. 247 గ్రామపంచాయతీలను మహిళలకు రిజర్వు చేశారు. తొలి విడత ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 275 మంది మహిళలు సర్పంచ్‌ గెలిచారు. రిజర్వు స్థానాలకన్నా ఎక్కువ స్థానాల్లో మహిళలు సర్పంచులుగా గెలిచారు. జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయడంతో పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా సర్పంచ్‌ పదవులు దక్కించుకున్నారు. తాజాగా రెండో విడతలో మహిళలు రిజర్వేషన్‌ చేసిన స్థానాలకంటే 15 చోట్ల జనరల్‌ స్థానాల్లోనూ గెలిచారు. రెండో విడతలో 489 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. ఇందులో 251స్థానాలు మహిళలకు రిజర్వ్‌ చేయగా.. 269 స్థానాల్లో మహిళలు గెలుపొందారు. రిజర్వు చేసిన స్థానాలకంటే 15 చోట్ల జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలో మూడు చోట్ల.. చెన్నూర్‌ మండలంలో 2 చోట్ల, మందమర్రిలో ఒకచోట జనరల్‌ గెలిచారు. నిర్మల్‌ జిల్లాలో మూడు చోట్ల.. సారంగాపూర్‌ మండలంలో 2 చోట్ల, లోకేశ్వరంలో ఒకచోట జనరల్‌ స్థానాల్లో విజయం సాధించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు చోట్ల.. బజార్‌ ఒకటి, తలమడుగు 1, గుడిహత్నూర్‌ 2 చోట్ల జనరల్‌ మహిళలు గెలిచారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఐదు చోట్ల.. ఆసిఫాబాద్‌ 3, తిర్యాణి 1, రెబ్బెన ఒకచోట జనరల్‌ మహిళలు ఘన విజయం సాధించారు.