ఉమ్మడి జిల్లాలో 14సీట్లు మావే

కూటమి కుట్రలను ప్రజలు చిత్తు చేస్తారు

ప్రచారంలో మంత్రి జూపల్లి

మహబూబ్‌నగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేసి మోసపోవద్దని ఓటర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మహాకూటమికి ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. కూటమి ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. గురువారం పాన్‌గల్‌ మండలంలోని బండపల్లి, బహదూర్‌ గూడెం గ్రామాల్లో మంత్రి జూపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొదుతారని రాష్ట్రంలో వందస్థానాలకు పైగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తారని, మరో 20 ఏండ్లపాటు కేసీఆర్‌ నేతృత్వంలో అధికారంలో కొనసాగుతుందని అందుకు ప్రజలు టీఆర్‌ఎస్‌విూద ఉన్న సంపూర్ణ విశ్వాసమే తెలియజేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధి కోసం పని చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేవిధంగా ఏర్పాటైన మహాకూటమిని రాజకీయంగా మట్టికరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌,టీడీపీలు రాజకీయంగా బద్దశత్రువులయినప్పటికీ కేవలం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గ్దదెదించాలనే దురుద్ధేశంతో రాజకీయ అనైతిక పొత్తుపెట్టుకుని కూటమిగా ఏర్పడ్డారని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాలకు పైగా పరిపాలన సాగించిన కాంగ్రెస్‌,టీడీపీ హయాంలో జరుగని అభివృద్ధిని కేవలం నాలుగున్నరేండ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని నేడు రైతులు సబ్బండ వర్ణాల ప్రజల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఆయన తెలిపారు. నేడు ఎన్నికల్లో ఓట్ల రాజకీయం కోసం టీడీపీ, కాంగ్రెస్‌లు సీమాంధ్ర స్వలా భం కోసం అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. కేవలం ఎన్నికల రంగంలో పోటీచేసేందుకే అభ్యర్థుల ఎంపిక ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నలలో, ఢిల్లీ నాయకత్వం రాహుల్‌గాంధీ చెప్పుచేతల్లో నడుస్తున్నదంటే రాబోవు రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి మాయాకూటమి ఏమాత్రం భంగం చేస్తుందో తేటతెల్లమవుతున్నదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్‌, జడ్పీటీసీ సభ్యుడు రవి, విండో ఉపాధ్యక్షుడు భాస్కర్‌, నాయకులు గోవర్ధన్‌, తిరుపతయ్య, జయ రాములు, శేషాద్రి, దర్గయ్య,

గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.