ఉమ్మడి నల్లగొండలో గులాబీ దూకుడు

ప్రజల్లో దూసుకెళుతున్న నేతలు
జోరుగా ప్రచారంతో ఓట్ల కోసం అభ్యర్థన
నల్లగొండ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతల ప్రచారం జోరందుకుంది. గులాబీ దళాలు గ్రామాల్లో ర్యాలీలతో ఆకట్టుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది.  గ్రామాల్లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, గొంగిడి సునీత ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని.. పేదల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలెన్నో చేపట్టిందని ప్రజలకు వివరించారు. జనం మళ్లీ సీఎం కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం ప్రచారం జోరుగా సాగుతోంది. వీరేశం తరఫున బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజార్ల సాంబయ్య క్యాంపెయిన్‌ చేశారు. 50 మంది మహిళలతో కలిసి.. నకిరేకల్‌ నుంచి నార్కట్‌
పల్లిలోని జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.  మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. ఎల్లగిరి గ్రామానికి చెందిన యాదవులు.. టీఆర్‌ఎస్‌ కే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుధీర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. ప్రభాకర్‌ రెడ్డి తరఫున గ్రామంలో గొల్లకుర్మలు ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి ఐతే ప్రజల కష్టాలన్నీ తీరుతాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌ కు ప్రజామద్దతు వెల్లువెత్తుతోంది. మోత్కూరు మున్సిపాలిటీలోని కాశవారిగూడెం కాలనీవాసులు టీఆర్‌ఎస్‌ కే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అటు విపక్ష పార్టీలు ఓట్ల కోసం మా కాలనీకి రావొద్దంటూ ప్లెక్సీ పెట్టారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌ను భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌ రావు ప్రచారం జోరుగా సాగుతోంది. మాడ్గులపల్లి మండల ప్రజలు ఆయన ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. కేసీఆరే మళ్లీ సీఎం కావాలంటూ ఊరూరా తీర్మానాలు చేస్తున్నారు. ప్రతీ ఊరు, ప్రతీ కుటుంబం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను అనుభవిస్తు న్నాయని భాస్కర్‌ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ కు ఓటేసి తనను గెలిపించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రజలకు వివరించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్‌ ప్రచార జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రచారానికి ఎక్కడికెళ్లినా ఆయనకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. మరోవైపు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కిషోర్‌ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు.