ఉల్టా చోర్‌..(కిక్కర్‌)

జేఎన్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌

– గాయపడ్డ 19మంది విద్యార్థులపై కూడా ..

– ముసుగు గుండాల కంటే ముందు బాధితురాలిపైనే కేసు..

హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి):ఢిల్లీలోని జేఎన్‌యూ దాడి ఘటన కేసులో ఇవాళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిశీ ఘోష్‌తో పాటు మరో 19 మందిపై కేసు నమోదు చేశారు. జనవరి 4వ తేదీన సెక్యూర్టీ గార్డులపై దాడి చేయడం, సర్వర్‌ రూమ్‌లను ధ్వంసం చేసినట్లు అయిశీ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. జేఎన్‌యూ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. జనవరి అయిదో తేదీన ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి.. జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి చేశారు. అయితే తనతోపాటు మిగతా విద్యార్థులపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌ ఆరోపించారు.అయిశీ ఘోష్‌ సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. ‘ఆదివారం క్యాంపస్‌లో శాంతిర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు నన్ను లక్ష్యంగా చేసుకొన్నారు. ముసుగు వేసుకున్న 25మంది ర్యాలీని అడ్డుకొని నా తలపై ఇనుప రాడ్లతో కొట్టారు’ అని పేర్కొన్నారు. దుండగుల్లో వర్సిటీ విద్యార్థులతోపాటు బయటివారు కూడా ఉన్నారని, ప్లాన్‌ ప్రకారం ఒక్కొక్కరిని ఒంటరిని చేసి కొట్టారని చెప్పారు. ఈ దాడిని వ్యవస్థీకృత దాడిగా అభివర్ణించారు. ‘దుండగులను అడ్డుకునేందుకు వర్సిటీలోని భద్రతా సిబ్బంది కనీస ప్రయత్నం చేయలేదు. వారికి, దుండగులకు సంబంధం ఉన్నదనేది సుస్పష్టం. మా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆరెస్సెస్‌ అనుబంధ ప్రొఫెసర్లు గత నాలుగైదురోజులుగా హింసను ప్రేరేపిస్తున్నారు’ అని ఆరోపించా రు. అయినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశా రు. వీసీ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. బుధవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. కాగా జవహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు, టీచర్లపై భయానక దాడి దురదృష్టకరమని, బాధాకరమని వైస్‌ ఛాన్స్‌లర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. విధ్వంసానికి పాల్పడినవారిని బాధ్యులుగా చేసి, వారి నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని చెప్పారు.జేఎన్‌యూలో రెండు రోజుల క్రితం జరిగిన విధ్వంసకాండలో 34 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన వ్యక్తులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రవేశించి ఇనుప చువ్వలతో దాడి చేశారు.ఈ నేపథ్యంలో వీసీ జగదీశ్‌ మాట్లాడుతూ చర్చలకు వేదికగా జేఎన్‌యూకు మంచి పేరు ఉందన్నారు. ఇకపై నూతన జీవితాలను ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. జగదీశ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆదివారం జరిగిన ఈ దాడిపై స్పందించడం లేదని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో వీసీ మాట్లాడుతూ ఆదివారం జరిగిన దాడికి బాధ్యులను గుర్తించి, వారి నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు. గాయపడిన విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని తెలిపారు. ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు చర్చలు జరుగుతాయనే మంచి పేరు జేఎన్‌యూకు ఉందని తెలిపారు. హింస ఓ పరిష్కారం కాదన్నారు. గతం మర్చిపోయి, కొత్త జీవితాలను ప్రారంభించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా, జేఎన్‌యూ రిజిస్టార్ర్‌ ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆదివారం జరిగిన దాడులపై ప్రొక్టోరియల్‌ ఎంక్వైరీ జరుగుతోందని తెలిపారు. ప్రాంగణంలో హింస గురించి భద్రతా విభాగం నుంచి నివేదిక వచ్చిన తర్వాత హింసకు బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు.