ఉల్లిఘాటు తగ్గించేందుకు చర్యలు

చెన్నై,అక్టోబరు 21(జనంసాక్షి): మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నా తమిళనాట మాత్రం కిలో ఉల్లి రూ.110 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరలు మండుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలా అయితే కొనడమెలా అని అన్నారు. రాష్ట్రానికి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. కొద్ది రోజులుగా వర్షాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండడంతో ఉల్లి సరఫరా ఆగింది. దిగుమతి ఆగడంతో ఉల్లి ఘాటెక్కింది. మున్ముందు ధర అమాంతంగా పెరుగుతూ కన్నీళ్లు పెట్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చెన్నైలో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న కోయంబేడుకు రోజుకు 150 లారీలు రావాల్సి ఉండగా తాజాగా 50 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ధర అమాంతంగా పెరిగింది. రాష్ట్రంలో ఉల్లి కొన్ని చోట్ల రూ.100, రూ.110 అంటూ ధర పలికింది. ఉల్లి ఘాటు మరింతగా పెరగనున్న నేపథ్యంలో పాలకులు స్పందించారు. ప్రభుత్వ తోట పచ్చదనం దుకాణాల ద్వారా ఉల్లిని తక్కువ ధరకు అందించేందుకు సిద్ధమ య్యారు. అలాగే డిమాండ్‌కు తగ్గ ఉల్లిని దిగుమతి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ప్రధానంగా ప్రజల్ని ఉల్లి ఘాటు నుంచి గ్టటెక్కించేందుకు ‘తోట, పచ్చదనం, వినియోగదారుల దుకాణంల ద్వారా కిలో రూ.45కు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని సహకార మంత్రి సెల్లూరు కే రాజు తెలిపారు. అలాగే పెరుగుతున్న ఉల్లి ధరను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేసి, ప్రజలకు తమ పరిధిలోని దుకాణాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా టోకు వర్తకులు ఉల్లి నిల్వ ఉంచుకుని ఉంటే, చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఈజిప్టు ఉల్లి 27 టన్నులు కోయంబేడుకు వచ్చి చేరడం కాస్త ఊరట కలిగించింది.