ఊపందుకున్న కర్ణాటక  రణరంగం  

కర్ణాటక ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నా మధ్యలో జనతాదళ్‌, బిజెపిలు అధికారాన్ని
పంచుకున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. మే 12న జరిగే ఎన్నికలకు సంబంధించి టిక్కెట్ల గొడవ కూడా పెద్దగానే ఉంది. స్థానిక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఒకవేళ కాంగ్రెస్‌ ఓడిపోతుందేమో కానీ లేకుంటే బిజెపికి అంతగా అనుకూల వాతావరణం ఏవిూ కనిపించడం లేదు. కావేరీ జలాల సమస్య బిజెపికి సవాల్‌ కానుంది. మరోవైపు కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కూడా ప్రభావితం చేయనున్నాయి. ఈ దశలో కాంగ్రెస్‌, బిజెపి ¬రా¬రి ప్రచారం చేపట్టాయి.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం కన్నడిగులకు ఆనవాయితీ. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవడం ఆనవామితీగా వస్తోంది. ప్రస్తుతం  అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందడం కర్ణాటక సంప్రదాయం కాదుకనుక  కాంగ్రెస్‌ గెలుపొంది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారని అనుకోవడానికి లేదు. ఒకవేళ సిద్దారామయ్య మరోమారు గెలిచి అధికార  పీఠంపైన కొనసాగితే చరిత్ర సృష్టించిన వారు అవతారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కన్నడిగులు ఓటు చేస్తారనే ఆనవాయితీ కూడా కాదనుకుంటే బిజెపిని గెలిపించాలి. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయే సంప్రదాయాన్ని కాదని సిద్ధరామయ్య కాంగ్రెస్‌ పార్టీని గెలిపించగలరా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. కర్నాటకలో గత ఐదేళ్లుగా సిఎం సిద్ధరామయ్య సంక్షేమ కార్యక్రమాలకు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చారు.  అన్నభాగ్య, ఆరోగ్యభాగ్య, క్షీరభాగ్య, ఇందిరా క్యాంటీన్‌ల వంటి జనరంజక పథకాలతో సిద్ధరామయ్యకు వ్యక్తిగతంగా మంచి పేరుప్రతిష్ఠలు వచ్చాయి. సామాన్య ప్రజలలో ఆయన పట్ల ఆదరణ పెరిగింది.  ఆత్మగౌరవ నినాదంతో, కర్ణాటకకు ప్రత్యేక పతాకం అనే విధానంతో కన్నడిగులలో ఆవేశం రగిలించి వారి అభిమానం సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారంలోకి దింపి మతపరమైన అవేశం పెంచడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి ఇది విరుగుడుగా అనేక ప్రయత్నాలు చేశారు. వెనుకబడిన తరగతులూ, దళితులూ, ముస్లింలను ఏకం చేసి ఒక సామాజిక కూటమిని సిద్ధరామయ్య ఏర్పాటు చేశారు. చివరగా లింగాయత్‌ల భావజాలాన్ని ఒక  ప్రత్యేక మతంగా గుర్తించి వారికి మైనారిటీ ¬దా ఇవ్వాలంటూ కర్ణాటక అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారు. ఓటర్లలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు చాలాకాలంగా బీజేపీ మద్దతుదారులు. వారిలో చీలిక తేవడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది.  అయితే కర్ణాటకలోని  బీజేపీ నాయకులలో అత్యంత ప్రాబల్యం కలిగిన వ్యక్తి యడ్యూరప్ప. అవినీతి ఆరోపణలపైన జైలుకు వెళ్ళినప్పటికీ న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగా తేల్చాయి. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కొందరు సీనియర్లపైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండు పార్టీలలోనూ గ్రూపులు ఉన్నాయి.  ముఖ్యమంత్రి ఎంత ప్రయత్నించినా లింగాయత్‌లు బీజేపీని పూర్తిగా విడిచిపెట్టే ప్రమాదం లేదు.  కాంగ్రెస్‌, బీజేపీ కాకుండా బరిలో ఉన్న మూడో పార్టీ జేడీఎస్‌. కర్ణాటకలోని అన్ని ప్రాంతాలలో జేడీఎస్‌కి బలం లేక పోయినప్పటికీ, హసన్‌, మైసూర్‌ ప్రాంతంలో ఈ పార్టీకి తిరుగులేని పట్టు ఉంది. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వం ఈ పార్టీకి ఒక ఊతం. కార్మికులలో కుమారస్వామికి గల పలుకుబడి మరో సానుకూల అంశం. మాయావతి నాయకత్వం లోని బహుజన సమాజ్‌ పార్టీ, వామపక్షాల మద్దతు జేడీఎస్‌కు ఉన్నది. అయితే, దీనికి తండ్రీకొడుకుల పార్టీ అనే పేరు ఉంది. 2004 ఎన్నికలలో జరిగిన
విధంగానే ఈ సారీ అతిపెద్ద  పార్టీగా కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ రావచ్చు.  కర్ణాటకను గెలుచుకుంటే బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు శుభశకునం అవుతుంది. తిరిగి అధికారాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకుంటే
బీజేపీకి ప్రత్యా మ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే అన్న భావన బలపడుతుంది. ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత 1977లో లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో కర్నాటక కూడా  ఇందిరా గాంధీకి అండగా నిలిచింది. 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ  కాంగ్రెస్‌ (ఐ) విజయఢంకా మోగించింది.  కర్ణాటకలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత రామకృష్ణ హెగ్డేకి దక్కింది.1978లో జనతా పార్టీ నాయకుడు మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది. 1983లో కాంగ్రెస్‌ కర్ణాటకలో చిత్తుగా ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1989లో కేంద్రంలో రాజీవ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ఓడిపోగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1994లో కాంగ్రెస్‌ నేత పీవీ నర సింహారావు ప్రధానిగా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో దేవెగౌడ నాయ కత్వంలోని జనతాదళ్‌ గెలిచింది. 1999లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ ఉన్న సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఢంకా బజాయించింది. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీఎస్‌, మరికొన్ని చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగింది. ఇప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడు జేడీఎస్‌ ప్రతినిధిగా తొలి సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006లో దేవెగౌడ  కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ ఎన్నికలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారాయి.