ఊరిస్తున్న ప్రపంచ క్రికెట్‌ టోర్నీ

లండన్‌లో వాలిపోయేందుకు సిద్దం అవుతున్న ఇండియన్స్‌
వీసా కోసం 80వేల మంది వరకు దరఖాస్తులు
న్యూఢిల్లీ,మే18(జ‌నంసాక్షి): పన్నెండో వన్డే ప్రపంచకప్‌ ఇప్పుడు క్రికెట్‌ అభిమానులను ఊరిస్తోంది.  చారిత్రక లండన్నగరంలో చాన్నాళ్ల తరవాత క్రికెట్‌ వేడుక జరుగబోతోంది.  ఎక్కడెక్కడి నుంచో లండన్‌లో వాలిపోవాలన్న ఆత్రుతలో అంతా ఉన్నారు. ఈనెల మే 30 నుంచి ఇంగ్లండ్‌, వేల్స్‌లో జరగబోయే క్రికెట్‌ సంబరాన్ని  తిలకించేందుకు భారత్‌ నుంచి అత్యధికంగా సుమారు 80 వేల మంది తమ దేశానికి పయనించే అవకాశముందని బ్రిటీష్‌ హైకమిషన్‌ పేర్కొంది. భారత్‌లో క్రికెట్‌ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. దీంతో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈసారి యూకే వీసాల కోసం భారీగా  దరఖాస్తులు  పెరిగాయన్నారు. రోజుకు సగటున 3500 మంది చొప్పున వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు బీహెచ్‌సీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ఈ మెగా ఈవెంట్‌ తిలకించేందుకు వస్తోరో తెలియదని, భారత్‌ నుంచి మాత్రం అధిక సంఖ్యలో వస్తారని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య మెరుగైన విమానసేవలు ఉన్నందు వల్ల కూడా క్రికెట్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచే తాము భారత్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానించే ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్లు పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారం చేశారని తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు మొత్తం ఏడు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందస్తుగా వీసా దరఖాస్తు చేసుకొనే సౌలభ్యం కల్పించామన్నారు. తద్వారా మూడు నెలల ముందే ఇంగ్లండ్‌ పయనించే అవకాశం కల్పించామని బీహెచ్‌సీ అధికారి చెప్పుకొచ్చారు. ఇక ఏప్రిల్‌ నుంచి ప్రపంచకప్‌ ముగిసేవరకు రెండో విడత ప్రచారం నిర్వహిస్తున్నామని, ఆఖరి నిమిషంలో ప్రయాణించే వారికి ప్రత్యేక సౌలభ్యం ఏర్పాటు చేశామన్నారు. అలాంటి వారికోసం ప్రయారిటీ వీసా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంతో 15 రోజుల్లో రావాల్సిన వీసా ఐదు రోజుల్లోనే వస్తుందన్నారు. తద్వారా పర్యాటకులు చూడాలనుకున్న మ్యాచ్‌ తప్పకుండా వీక్షించే అవకాశం కలుగుతుందని అధికారి పేర్కొన్నారు. అంతేగాకుండా లండన్‌ అందాలు చూసే భాగ్యం ఉంటుందని అన్నారు.