ఎండల నేపథ్యంలో పర్యాటకుల తాకిడి

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ల అందాలకు ఫిదా
అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు
నిజామాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): వారాంతపు విడిది కోసం నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌  వివిధ ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకుల రాక పెరిగింది. ఎండలు ముదరడంతో నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాలను, అటవీ ప్రాతాలను సందర్శిస్తున్నారు. కుంటాల జలపాతం, నిర్మల్‌ తదితరప్రాంతాలకు సెలవు రోజుల్లో రద్దీ ఉంటోంది.  కనువిందు చేసే విధంగా ఉన్న పోచారం అభయారణ్యా నికి రోజు రోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో ఈ ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడి పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టిసారించింది. జిల్లా కేంద్రానికి 16 కిలోవిూటర్లు ఉంది. పోచారం అభయారణ్యానికి హైదరాబాద్‌, మెదక్‌ పట్టణంతోపాటు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. పోచారం అభయారణ్యానికి చూసేందుకు గాను ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ అభయారణ్యంలోకి వెళ్లేందుకుగాను పెద్దవాహనాలకు మాత్రమే 150 చెల్లిస్తే అభయారణ్యంలోకి వెళ్లి చూసివచ్చేందుకు గాను అనుమతినిస్తారు. ఇందులో అడవి జంతువులైన అడవి పందులు, నెమళ్లు, నీలిగాయ్‌, దుప్పిలు, చుక్కల జింక, అడవిగొర్రెలు వంటివి ఉన్నాయి. వీటిని చూసేందుకు గాను పర్యాటకులు సెలవు రోజుల్లో అధికంగా తరలివస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రకృతి ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం కూడిన ఈ ప్రాంతం పర్యాటకులతో రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీంతో పర్యాటకులు అత్యధికంగా ఈ ప్రాంతానికి వచ్చి అడవి జంతువులను చూసేందుకు గాను ఎంతో ఇష్టపడుతుంటారు. రాబోయే రోజుల్లో ఇక్కడ మరింత వసతి కల్పనకు గాను ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దీంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఎంతో ఇష్టపడుతారు. పోచారం అభయారణ్యానికి వచ్చిన పర్యాటకులకు గెస్ట్‌హౌస్‌ వద్ద కూర్చుకునేందుకు వీలుగా టేబుళ్లతోపాటు చుట్టుపక్కల ఫార్కును ఏర్పాటు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు తరలివచ్చి సేదతీరేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఆడుకునేందుకు గాను ఉయ్యాల తదితర ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మరింత వసతి కల్పించేందుకు గాను అధునూతన గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి గాను నిధులు మంజూరు చేయగా ఇప్పటికే పనులు జోరుగా కొనసాగుతున్నాయి.