ఎండాకాలంలో విద్యార్థులు జాగ్రత్త

వారికి సూచనలు ఇవ్వాలన్న వైద్యాధికారులు
హైదరాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండ తీవ్రత పెరిగుతోంది. అప్పుడే బెంబేలెత్తించేలా సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు.  సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉద్యోగాలు, పనులకు వెల్లాల్సిన వారు జాతగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ కారణంగా అనేకమంది అస్వస్థతకు గురవుతారు. శరీరంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువైతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  వేసవిలో ప్రధానంగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. నెలఖారుకు ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు రెండు పూటలా జరుగుతున్నాయి. బడుల్లో చిన్నారులు అస్వస్థతకు గురికాకుండా ఓఆర్‌ఎస్‌ పొట్లాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.  ఉపాధి కూలీలకు వేసవి తీవ్రత నుంచి రక్షణ కల్పించాలి. ఓఆర్‌ఎస్‌ పొట్లాలు, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.  తీవ్ర తలనొప్పి, నీరసం, చర్మం పొడిపారడం, మూత్రం పసుపురంగులో మంటతో రావడం, సొమ్మసిల్లి పడిపోవడం, తల తిప్పడం, నాలుక ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంపై ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. వడదెబ్బకు గురైనట్లు భావించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి మార్చి రెండోవారంలో ఉండాల్సిన  ఎండతీవ్రత అప్పుడే
ప్రారంభమైంది. అందుకే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో జనం బెంబేలెత్తుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడు అధికంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత కూడా పెరిగింది. ఎండ తీవ్రత ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. దీనికితోడు విశ్రాంతి లేకుండా ఎండలో పనిచేయడం, తిరగడం, నీరు తక్కువ తాగడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వడదెబ్బకు గురవుతారు.  ఎండలో ఎక్కువగా తిరగాల్సి వస్తే.. తలపై వెడల్పు టోపీ ధరించాలని సూచిస్తున్నారు.  ఎప్పటిలా కాకుండా నీరు, ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.  ప్రతి రెండు గంటలకు ఒకసారి నీరు తాగాలి. మసాలాలు, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలి. శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గించడానికి తడిగుడ్డతో పలుమార్లు తుడవాలి.  శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడకుండా పండ్ల రసాలను తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.