ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తే లేచి నిలబడాల్సిందే!

హర్యానా ప్రభుత్వం వివాదాస్పద సర్క్యులర్‌ జారీ
చండీగఢ్‌, జూన్‌19(జ‌నం సాక్షి ) : హర్యానా ప్రభుత్వం మరో వివాదాస్పద సర్క్యులర్‌ జారీ చేసింది. రాష్ట్రంలో పని చేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే, ఎంపీ వస్తే లేచి నిలబడాలని, వాళ్లు ఏం చెప్పినా వెంటనే స్పందించాలని ఆదేశాలు జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. నిజానికి కేంద్ర ప్రభుత్వం రాష్టాన్రికి పంపిన సర్క్యులర్‌కు ఇది చాలా దగ్గరగా ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం, ఐఏఎస్‌ అధికారుల మధ్య ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హర్యానా చీఫ్‌ సెక్రటరీ దీపిందర్‌ సింగ్‌ ధేసి కార్యాలయం నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై సోషల్‌ విూడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ రాష్టాల్రను బట్టి ఒక్కోలా వ్యవహరిస్తున్నదని, దీనికి హర్యానా, ఢిల్లీలలో అధికారులు తీరులో తేడానే ఇందుకు నిదర్శనమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఫిబ్రవరి 7నే కేంద్రంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ నుంచి అన్ని రాష్టాల్ర చీఫ్‌ సెక్రటరీలకు ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవి సరిగ్గా అమలయ్యేలా చూడాలని, అందరు అధికారులకు దీనిపై అవగాహన కల్పించాలని అందులో స్పష్టంచేశారు. కొందరు ప్రజా ప్రతినిధులతో అధికారుల తీరు సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో డీవోపీటీ ఈ ఆదేశాలను జారీ చేసింది. అధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలా స్వాగతం పలకాలి.. ఎలా వీడ్కోలు పలకాలన్నదానిపై హర్యానా ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఈ మార్గదర్శకాలు ఉన్నా.. ఎప్పటికప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు వాటిని గుర్తు చేస్తూ సర్క్యులర్లు జారీ చేస్తుంటాయి.