ఎక్కువ ధరకు అమ్మితే షాపులు సీజ్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కూరగాయల ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ధరకు అమ్మితే పీడీయాక్ట్‌ పెట్టి జైలుకు పంపుతాం. లైసెన్స్‌లు రద్దు చేసి..షాపులు సీజ్‌ చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే పర్మనెంట్‌గా బ్లాక్‌లిస్టులో పెడతాం.  అత్యవసర సమస్యలు వస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయండి. అని సీఎం కేసీఆర్‌ సూచించారు. కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.  సాయంత్రం 6 గంటల కల్లా అన్ని దుకాణాలు మూసేయాలి.  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సమస్య ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఎవరికీ తెలియదు.   టోల్‌ ప్లాజాల దగ్గర ఈ రాత్రికి మినహాయింపు ఇస్తాం.. ఉదయానికంతా వారు గమ్యస్థానాలకు చేరుకోవాలి. రైతులు మార్కెట్‌ కమిటీలకు రావొద్దు.. మీ ఊళ్లలోనే కూపన్స్‌ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు మార్కెట్‌ యార్డ్‌కి రావొద్దు.

గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో అంతా బాగుంది. ప్రజలు పోలీసులకు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. ప్రతి చెక్‌పోస్ట్‌ దగ్గర ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు కూడా చేసుకోవచ్చు. లేబర్‌ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పాం. చాలా గ్రామాలు కంచెలు వేసుకున్నాయి. గ్రామ పంచాయతీలలో ఉన్న స్టాండింగ్‌ కమిటీ సభ్యులంతా రంగంలోకి దిగాలి.  ప్రతి సర్పంచ్‌ ఆ గ్రామానికి కథానాయకుడు కావాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.