ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు.. చాలాసార్లు తప్పాయి 


– తెలంగాణలో మూడు స్థానాల్లో గెలుస్తాం
– హాజీపూర్‌ బాధితులతో కేటీఆర్‌ ఇప్పటికైనా నేరుగా మాట్లాడాలి..
-కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు
హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమే అధికారం చేపట్టబోతోందన్న సర్వేలను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కొట్టిపడేశారు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు చాలాసార్లు తప్పాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలు గెలుస్తామని అన్నారు. పంజాగుట్టలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. హాజీపూర్‌ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ ఫోన్లో మాట్లాడితే బాధితుల కడుపు నిండదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్‌ జిమ్మిక్కులు మానుకోవాలని వీహెచ్‌ సూచించారు. ఎన్డీయే ఐదేళ్ల పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ విషయం ఎన్నికల సమయంలోనూ స్పష్టంగా కనిపించిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. గతంలో వెలువడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ చాలాసార్లు తప్పాయన్నారు. వీటితో మనం ఎన్డీయేనే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పలేమని, కాంగ్రెస్‌ కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లే సమర్థత, అన్ని వర్గాలకు న్యాయం చేయగలిగే తత్వం ఒక్క కాంగ్రెస్‌కే ఉందని ప్రజలు గమనించారని, దీంతో భాజపాకు కాకుండా భాజపాయేతర పక్షాలకు తమ ఓటువేసి గెలిపించబోతున్నారని హన్మంతరావు అన్నారు.