ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల ఘన నివాళి


– ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నందమూరి వారసులు
– తెలుగు భాష ఉన్నంత వరకు ఎన్టీర్‌ మన మధ్యే ఉంటారు – హరికృష్ణ
– ఎన్టీఆర్‌ ఆశయాలను నిలబెట్టే వారసురాలిని నేనే – లక్ష్మీపార్వతి
– ఎన్టీఆర్‌ అనితర సాధ్యుడు – బాలకృష్ణ
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి వారసులు హరికృష్ణ, బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ మనవళ్లు కళ్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కూడా దివంగత నేతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. తెలుగు భాష ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ మన మధ్య జీవించి ఉంటారన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు సతీమణి భవనేశ్వరి, బ్రాహ్మణి, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రాం, లక్ష్మీపార్వతి తదితరుల ఘనంగా నివాళులర్పించారు.
ఎన్టీఆర్‌ అనితర సాధ్యుడు – బాలకృష్ణ
అనితర సాధ్యమైన రాజకీయ చరిత్ర సృష్టించిన ఘనుడు ఎన్టీఆర్‌ అని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్‌ పేరు చెబితేనే ఒళ్లు పులకించిపోతుందన్నారు. పేదల ఆరాధ్య దైవం… సార్థక నామధేయం.. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే… ఒక కుటుంబ వ్యవస్థ అని తెలిపారు. తెదేపా బలోపేతానికి కుటుంబ సభ్యులంతా అహర్నిలు కృషి చేయాలని, ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో ఎన్టీఆర్‌ జీవితం ఆధారం ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. త్వరలో ఈ సినిమా ప్రారంబిస్తామని, ఎన్టీఆర్‌లోని ఎవరికి తెలియని కోణాలు చాలా ఉన్నాయని, వాటిని తెరపై చూపించేలా కృషి చేస్తానని అన్నారు. అనంతరం టీతెదేపా రాష్ట్ర అధ్యక్షులు మోత్కుపల్లి మాట్లాడుతూ .. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్‌… 33 ఏళ్ల పాటు చలనచిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగారని, అనంతరం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని పేర్కొన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, శ్రీపతిరాజేశ్వర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమర్‌ రహే ఎన్టీఆర్‌ అంటూ కార్యకర్తలు పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రసూల్‌పురా నుంచి ఎన్టీఆర్‌ అమరజ్యోతి యాత్రను బాలకృష్ణ ప్రారంభించారు.
ఎన్టీఆర్‌ ఆశయాలను నిలబెట్టే వారసురాలిని నేనే – లక్ష్మీపార్వతి
మహానేత ఎన్టీఆర్‌ లేని బాధను గుండెల్లో దాచుకున్నా నని లక్ష్మీపార్వతి అన్నారు. గురువారం ఎన్టీఆర్‌ 22వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం ఎన్టీఆర్‌ మళ్లీ పుడతారన్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ను
గౌరవించని తెలుగు సభలకు బాలకృష్ణ ఎలా వెళ్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఎన్టీఆర్‌ను గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఎన్టీఆర్‌ను గౌరవిస్తారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. కాగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా తీస్తే…ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటకు రావాలన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా?అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఆశయాలు నిలబెట్టే అసలైన వారసురాలుని తనేనని చెప్పారు. చంద్రబాబుని గద్దె దించిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు.