ఎన్డీఏ కూటమి పొత్తుకుదింది

పట్నా,అక్టోబరు 21(జనంసాక్షి): భారత క్రికెట్‌ జట్టులో క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌ – వీరేంద్ర సెహ్వాగ్‌ జోడీలాగే బిహార్‌ ఎన్నికల్లో భాజపా – జేడీయూల పొత్తు కూడా సూపర్‌ హిట్టేనని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన భాగల్పూర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా- జేడీయూ కూటమి చేసిన అభివృద్ధిని ప్రజలు చూసి ఓట్లేయాలని విజ్ఞప్తిచేశారు. అవినీతి మరకలేని సీఎం నితీశ్‌కుమార్‌ను ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో 15 ఏళ్లపాటు బిహార్‌ను పాలించిన ఆర్జేడీ అధికార దుర్వినియోగం, ప్రస్తుతం నితీశ్‌కుమార్‌ సారథ్యంలో సుపరిపాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించవచ్చన్నారు. దశాబ్దాల పాటు అమలుకు నోచుకోని కనీస వసతులను రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. విద్యుత్‌, రహదారులు, తాగునీరు ఇలా అనేక వసతులను కల్పించిందని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు. గతంలో లాంతర్‌ (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) 15 ఏళ్ల పాలనను, ప్రస్తుతం భాజపా -జేడీయూ పరిపాలనను బిహార్‌ ప్రజలు చూశారన్నారు. ఈ రెండు ప్రభుత్వాల పనితీరుకు అసలు పోలికే ఉండదని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో బిహార్‌ రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీలను రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. అవినీతి విషయంలో నితీశ్‌ను ఎవరూ వేలెత్తి చూపలేరన్నాన్నారు. స్థానిక భోజ్‌పురి భాషలో మాట్లాడిన రాజ్‌నాథ్‌సింగ్‌.. ఆర్జేడీపై పంచ్‌లు పేల్చారు. ‘లాంతర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దానిలో చమురు జారిపోయింది. ఇప్పుడు ఏదీ పనిచేయదు’ అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాని మోదీ చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన వంటి పథకాలు ప్రజల సాధికారతను పెంచడమే కాకుండా అట్టడుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కోసమేనన్నారు. దేశ సరిహద్దులోని లద్దాఖ్‌లో గల్వాన్‌ లోయ వద్ద చైనాతో చోటుచేసుకున్న ఘర్షణల్లో బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికుల త్యాగాలను కొనియాడారు.