ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసవాలు జరిగి ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ శిశువుకు రూ.12 వేలు, కేసీఆర్‌ కిట్‌ అందజేస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి 4 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామని సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూని పేర్కొన్నారు. ఇంటింటికి నల్లా నీరు అందించక పోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన నాయకుడు ఉన్నారంటే సీఎం కేసీఆరేనని శనివారం నాడిక్కడ అన్నారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే కాంగ్రెస్‌, భాజపా పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సిఎం కెసిఆర్‌ పెద్దపీట వేశారని అన్నారు. సమైక్య పాలనలో కోల్పోయిన అభివృద్ధితెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సాధ్యమైందని అన్నారు. గత కాంగ్రెస్‌,టిడిపి పాలకులకు చిత్తశుద్ధిలేక అభివృద్ధిని విస్మరించారని అన్నారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. విమర్శలు చేసేవారు జరుగుతున్న పనులను చూడాలన్నారు.