ఎన్నికలకు సమాయత్తం అయిన అధికారులు

నామినేషన్ల ఘట్టం మొదలయినా ముందుకు రాని అభ్యర్థులు
వరంగల్‌/భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్‌, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఖరారుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా, టికెట్‌పై ధీమాగా ఉన్న వారు నామినేషన్‌ దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ జరిగే భువనగిరి, వరంగల్‌ లోక్‌సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పక్రియ అటు వరంగల్‌ ఇటు భువనగిరి యాదాద్రి జిల్లాకేంద్రాల్లో మొదలైంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, ఏప్రిల్‌ 11న పోలింగ్‌, మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఆయా లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలై ఎన్నికల కోడ్‌ అమలుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. ఎంసీసీ, ప్లయింగ్‌ స్కాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లను రంగంలోకి దింపింది. పోలింగ్‌ నిర్వహణ కోసం ప్రిసైడింగ్‌ (పీవో), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారుల(ఏపీవో) నియామకం పూర్తయింది. పోలింగ్‌ కోసం ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను సిద్ధం చేసి ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ పూర్తి చేశారు.