ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదు

కెసిఆర్‌ మోసాలు ప్రజలు గ్రహించారు: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్నికల్లో ఇప్పుడు వారి ద్వారా రైతులను అధికరా పార్టీ మేనేజ్‌ చేసే పనిలో పడిందని అన్నారు. కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్‌ను విమర్శించడంలో అర్థం లేదన్నారు. ఎందుకు ఎన్నికలకు వెళ్లారో చెప్పే ధైర్యం లేదని, ప్రజలకు విషయం చెప్పి ఒప్పించగలరా అని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ఇందుకోసం నిరసనలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ ప్రభంజనం వీస్తోందని, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ముగింపు పలకాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ, రిజర్వేషన్లు, మూడెకరాల భూమి వంటి మాయమాటలతోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఇప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రమే ప్రజలకు, రైతులకు న్యాయం చేసేలా పోరాడుతాం అని ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే మల్లన్నసాగర్‌ పేరుతో అరాచకం సృష్టించారని, రైతులను వేధింపులకు గురి చేశారని అన్నారు. వేములఘాట్‌ గ్రామంలో ఎకరాకు ఆరు లక్షలిచ్చి వెళ్లిపొమ్మంటే రైతులు ఎక్కడికి పోవాలన్నారు. ఇల్లూ,గొడ్డూగోదా వదులకుని ఎక్కడికి పోతారని అన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూసేకరణ చేయడమేంటన్నారు. ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న అభిప్రాయం బయటపడిందని ఎద్దేవాచేశారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల విషయంలో అధికారపార్టీ న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందన్నారు.