ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి
పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు పక్రియ పూర్తి కావడంతో తొలిదశ పూర్తయ్యిందన్నారు.  వచ్చే నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ కోసం ఈవీఎంల తరలింపుపై జిల్లాస్థాయిలో మార్కెట్‌యార్డు గోడౌన్‌లో ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ మిషన్లను నిక్షిప్తం చేశామని చెప్పారు. కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వీవీప్యాట్‌లు వివరాలతో కూడిన ప్రతులను అన్ని రాజకీయ పక్షాలకు అందజేస్తామన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం పరిధిలో దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, వయోవృద్ధుల వివరాలను ఓటర్ల జాబితాలో మార్కింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్‌ మెటీరియల్‌ను సకాలంలో పంపిణీ చేసేందుకు రిటర్నింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 160 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించనున్నామని, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణ అధికారి పంచాయతీరాజ్‌ ఈఈకి సూచించారు. 400 పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయనున్న సీసీ కెమేరాల వివరాలు తనకు అందజేయాలని పోలీసులకు కూడా సూచించారు. వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించే పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయవద్దని పంచాయతీరాజ్‌ శాఖ అధికారికి సూచించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నా మన్నారు. పోలింగ్‌ విధులు కేటాయించిన పోలీసు, అటవీశాఖ సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్లు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు ఏర్పాట్లతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అవసరమైన సంఖ్యలో అందుబాటులో ఉంచడం, సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణం పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఎలాంటి జాప్యం లేకుండా ఈవీఎంలను పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్‌కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సుల తరలింపుతో సహా ఎన్నికల పక్రియకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగే విధంగా బాధ్యులను నియమించి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉన్న ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ మిషన్లను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైనీ తెలిపారు.