ఎన్నికల ప్రసంగాల్లో మోడీ, షాల దూకుడు

మడిగట్టుకుని కూర్చుంటే మనలను ఎవరూ దగ్గరకు రానీయరు. సంప్రదాయ పార్టీగా ప్రజల్లో ఉన్న ముద్రతో ముందుకు వెళితే బిజెపిని కూడా ఎవరూ విశ్వసించరు. ఇది మోడీ, అమిత్‌ షాల అభిప్రాయంగా ఉంది. అందుకే వారు పార్టీ పగ్గాలు చేపట్టిన తరవాత బిజెపి స్వరూపాన్ని కూడా మార్చేశారు. కత్తికికత్తి సమాధానం అన్న విధానం ఆచరిస్తున్నారు. బెంగాల్లో పాగా వేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు, ప్రధాని మోడీ, అమిత్‌షాలు చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే బిజెపిని రాటుదేలేలా చేశారని అనుకోవాలి. విమర్శల్లో కూడా ఎవరినీ వదలడం లేదు. మాజీ ప్రధానులు జవహర్‌ లాల్‌ మొదలు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ వరకు అందరినీ మోడీ తూర్పారా బట్టారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు చూస్తుంటే ఎదుటి పార్టీలను దునుమాడడమే లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ సంస్కృతి, సంప్రదా యాలను, అలాగే భవిష్యత్తును  కాపాడేది తామేనని చెప్పుకొంటున్నారు.  దాదాపు మూడు దశాబ్దాల క్రితం మరణించిన రాజీవ్‌గాంధీని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. బోఫోర్స్‌ను మళ్లీ బయటకు తీసి ఎదురుదాడికి దిగారు. అత్యంత దారుణంగా హత్యకు గురైన రాజీవ్‌గాంధీని విమర్శించడంలో కూడా  ప్రధానమంత్రి మోడీ వెనకాడడం లేదు. నాటి బోఫోర్స్‌ కేసు నుంచి రాజీవ్‌గాంధీకి ఎప్పుడో విముక్తి లభించింనా ఇప్పుడు రాజీవ్‌గాంధీ అవినీతిపరుడని మోదీ విమర్శించడంలో రాజకీయం దాగుంది. ఇప్పటి తరానికి బోఫోర్స్‌ గురించి కానీ, రాజీవ్‌గాంధీ గురించి కానీ తెలియదు. బోఫోర్స్‌ మచ్చ తప్పితే రాజీవ్‌ గాంధీ మిస్టర్‌ క్లీన్‌గానే ప్రధానమంత్రి పదవిలో ఐదేళ్లు కొనసాగారు. ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతుల్లో ఆయన హత్యకు గురై ఉండకపోతే కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఈ దుస్థితి దాపురించి ఉండేది కాదు. రాజీవ్‌ గాంధీ హత్యానంతరం ప్రజల్లో నెలకొన్న సానుభూతి కారణంగానే కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడం, తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కావడం తెలుసు. తనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని  నరేంద్ర మోదీ ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా రుజువు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత టి. అంజయ్యను రాజీవ్‌ అవమానించారని కూడా ప్రచారంలో ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మోదీ చెప్పడం కూడా మమతను బెదిరింపులకు గురిచేయడమే.  నరేంద్ర మోదీకి స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల్లో ఎవరినీ వదిలి పెట్టడం లేదు. అవినీతిపరుల పాలిట తాను ఛండశాసనుడనని చెప్పుకొనే నరేంద్ర మోదీ తనపై అవినీతి ఆరోపణలు నిరూపించాలని తాజాగా సవాల్‌ విసిరారు. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని ముప్పుతిప్పలు పెట్టడానికై అక్కడ అమిత్‌షా సవాళ్లు విసురు తున్నారు. రా కాసచుకో అని మమతకు గట్టిగానే చెబుతున్నారు. తజాఆగా అక్కడ జరిగిన అల్లర్లు, దహనాలు చూస్తే బిజెపి సాదాసీదా పార్టీగా లేదన్న విషయం ప్రజలకు తెలియచేశారు. గతంలో  ఏ ప్రధాన మంత్రి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీని, లేదా నాయకుడిని ఇలా లక్ష్యంగా చేసుకోలేదు. అయితే ఈ పరిస్థితులను కాంగ్రెస్‌, ఇతర పార్టీలు గమనించి మోడీ పని అయిపోయిందంటూ ముందస్తు ఊహాగానాల్లో ఉన్నారు. మోడీ,షాలను దెబ్బతీయడం అంత ఈజీ కాదని గుర్తించడం లేదు. బీజేపీ అధికారానికి దూర మయ్యే పక్షంలో కేంద్రంలో ఏర్పడే ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఎవరికివారు తామే నాయకత్వం వహించా లని ఉబలాటపడుతున్నారు. మమతా బెనర్జీ, మాయావతి, శరద్‌ పవార్‌, కెసిఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ ఇలా ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగి తేలుతున్నారు. అందుకే రాహుల్‌ను బచ్చాగా చూస్తున్నారు. అతని
నాయకత్వంలో పనిచేయడం కుదరదన్న భావనలో ఉన్నారు. మమతా బెనర్జీ, మాయావతికి కూడా ప్రధానమంత్రి కావాలన్న కోర్కె బలంగా ఉంది. ఈ కారణంగానే వారిరువురూ ప్రధానమంత్రి పదవికి రాహుల్‌గాంధీని అంగీకరించడానికి సుముఖంగా లేరు. కాంగ్రెస్‌ పార్టీకి 150కి పైగా స్థానాలు లభిస్తే తప్ప రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. అలా జరగని పక్షంలో మరో పేరు తెర విూదకు వస్తుంది. మోదీని గ్దదె దించే లక్ష్యంలో భాగంగా ఎవరు ప్రధానమంత్రి అయినా మద్దతివ్వడానికి కాంగ్రెస్‌ మానసికం గా సిద్ధంగా ఉంది. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అనుభవమున్న చంద్రబాబు, ఇప్పుడు కూడా అదే ప్రయోగం చేసే సపనిలో ఉన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో వామపక్షాలకు కూడా ప్రధాన పాత్ర ఉండింది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వామపక్షాలు బలహీన మయ్యాయి. ఫలితంగా మమతా బెనర్జీ, మాయావతిల నిర్ణయం కీలకం అవుతుంది. ఇదే దశలో కెసిఆర్‌ కూడా కూటమి రాజకీయాలకు తెరతీసారు. తనకు అనుకూలంగా ఉన్న నేతలతో చర్చిస్తున్నారు. అయితే ఎంతమంది తనవెంట వస్తారన్నది గట్టిగా చెప్పలేని పరిస్థితి. స్టాలిన్‌ ప్రకటనతో కెసిఆర్‌ ప్రయత్నా లు బెడిసి కొట్టాయనే భావించాలి. అయితే వీరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మోడీకి ఇంకా ఛరిష్మా తగ్గలేదు. బిజెపిని ఉన్నత స్తితికి తసీఉకుని వెళ్లడమే గాకుండా పటిష్టంగా చేయగలిగారు. బెంగాల్‌, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఢీ అంటే ఢీ అనేలా తాయరు చేశారు. ఈ దశలో మోడీ, అమిత్‌షాల వ్యూహాలు కూడా భిన్నంగా ఉన్నాయి. అధికారం కోసం వారు ఎంతకైఆన వెనకాడరని తాజా ప్రచారం రుజువు చేస్తోంది. 19న తుదివిడ పోలింగ్‌ ముగిసి,23న ఓట్ల లెక్కింపుతో వీరి ప్రభావం ఏ మేరకు అన్నది తేలనుంది.