ఎన్నికల ముందే పొత్తులపై స్పష్టత

– జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలపద్రం అయ్యాయి
– అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర
– సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించండి
– నన్ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్నారు
– తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణం
– నేనేం చేసినా ఏపీ ప్రజల బాగోగుల కోసమే చేస్తా
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): బీజేపీయేతర పక్షాల కూటమి ఉంటుందని, జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలప్రదం అయ్యాయని, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. పింఛన్‌ కింద ఏడాదికి రూ.24వేలు, పసుపు కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ.20వేలు, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇస్తున్నామని, ఈ మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణమని చంద్రబాబు ఆక్షేపించారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే మిన్న అని వ్యాఖ్యానించారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనుకోవడం చారిత్రక నిర్ణయమని అన్నారు. రైతు సాయానికి కేంద్రం ఎన్నో షరతులు విధించిందని, మనం దానికంటే మెరుగ్గా చేశామని తెలిపారు. కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నో కష్టాల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు జరిగింది ఒక్క ఆంధప్రదేశ్‌లోనే అన్నారు. కాపులకు రిజర్వేషన్లని చెప్పి మోసగించింది వైఎస్‌ అని, జగన్‌కు కాపు రిజర్వేషన్లతో సంబంధం లేదంటూ మండిపడ్డారు. కులాలను రెచ్చగొట్టే కుట్రలు వైకాపా చేస్తోందని చంద్రబాబు మండిపడ్డాడు. ‘నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నానని, ఐదు కోట్ల ప్రజల హక్కుల కోసం ధర్మపోరాటం చేశానన్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని, అవకాశవాదులకు టీడీపీలో స్థానంలేదని చంద్రబాబు అన్నారు. ఓవైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ విూరిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ నిరంతర శ్రమ అని అన్నారు. ఢిల్లీలో కేజీవ్రాల్‌ దీక్షకు గొప్ప స్పందన వచ్చిందని, మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు.  అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర అని, కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు విధించిందని, ఏపీలో మాత్రం ఎలాంటి ఆంక్షలులేకుండా రైతులందరికీ ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. ఇచ్చిన గౌరవాన్ని కృష్ణమోహన్‌ నిలుపుకోలేకపోయారన్నారు. బిజీగా ఉన్నా ఆమంచితో గంట సేపు మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.700కోట్లు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణతో ఉండాలని, ఇష్టారీతిలో ఉంటూ.. ప్రజల్లో చెడ్డపేరు తీసుకొస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.